
రైతు క్షేమం కోసం తెనాలి నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టినట్లు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) పేర్కొన్నారు. ఆయన తెనాలి గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం, శ్రీవిద్యాపీఠంలో మాట్లాడారు. తొలుత ఆయన విద్యాపీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర చేపట్టారు. వచ్చే నెల 4వ తేదీకి తిరుపతి చేరుకుంటామని, ప్రతి 20 కి.మీ. తరువాత ఆగి అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మార్గమధ్యలో పట్టణంలోని గంగానమ్మ తల్లి, వైకుంఠపురం ఆలయాల వద్ద అధికారులు స్వామికి స్వాగతం పలికి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆయనతో పాల్గొన్నారు. ఓ శునకం తెనాలి నుంచి బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడకు వారి వెంట వెళ్లింది. మఠం ట్రస్టు ఛైర్మన్, కార్యదర్శులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, సహాయ కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.





