
భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్.. ఐజీఎన్సీఏ తన 10వ ప్రాంతీయ కేంద్రాన్ని తిరుపతిలో ప్రారంభించింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వైష్ణవ ఆగమ విధానం అధ్యయనానికి, భారతీయ శిల్పకళా సంప్రదాయాల పరిశోధనకు కృషి చేయనుంది. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ ప్రత్యేక సందేశాన్ని పంపారు. తిరుపతి, తిరుమల, తిరుచానూరు పవిత్ర పుణ్యక్షేత్రాలని, ఈ ప్రాంతంలో ఐజీఎన్సీఏ పదవ కేంద్రాన్ని ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ విభూషణ్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక వారసత్వ సంరక్షణలో ఐజీఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఐజీఎన్సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి మాట్లాడుతూ, ఈ కేంద్రం ఆంధ్ర నాట్యం, పోచంపల్లి బొమ్మలు వంటి కళా సంపదను పరిరక్షించడంలో కీలకంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, డాక్టర్ ప్రియాంక మిశ్రా తదితరులు పాల్గొన్నారు.





