News

ధర్మ రక్షణ కోసం ఆర్.ఎస్.ఎస్.

331views

ధర్మరక్షణ కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్లుగా పనిచేస్తుందని సహప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాస రెడ్డి అన్నారు. విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఆదివారం జరిగిన విశాఖ మహా నగర ఆర్ఎస్ఎస్ సమావేశానికి ట్రినీటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సచ్చేంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహానగర సంఘ్‌చాలక్ పివి నారాయణ రావు, సహ సంఘ్‌చాలక్ బి.సి‌.అగర్వాల్ పాల్గొన్నారు.

ట్రినీటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నాగ వెంకట సత్యేంద్ర ప్రారంభ ఉపన్యాసంలో ప్రసంగిస్తూ భారతీయతను ముందుకు తీసుకువెళ్లాలని,ఏ పని చేసినా భారత దేశం గర్వించేలా చేయాలని, ఆ పనులకు ఆర్ఎస్ఎస్ ముందుంటుందని కొనియాడారు. మేథాశక్తి, నైపుణ్యానికి భారత్ పెట్టింది పేరు‌ అని అన్నారు.

ఆర్.ఎస్.ఎస్ సహప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్‌కు వందేళ్లు” ఉత్సవాలు చేసుకుంటున్నామని, ధర్మానికి హాని జరిగినపుడు మన కర్తవ్యాన్ని గుర్తించాలని గీత చెప్పిందని ఇప్పుడు ఆ పనిని ఆర్ఎస్ఎస్ స్వీకరించిందని అన్నారు. ధర్మరక్షణకోసం ఆర్.ఎస్.ఎస్ వందేళ్లుగా పని చేస్తోందని, వ్యక్తికి దేశభక్తి, సంస్కృతి పట్ల నిష్టవుండాలని, దేశానికి పూర్వవైభవం తీసుకురావాలని అన్నారు.తనకు జన్మనిచ్చిన దేశం కోసం తానే పాటుపడాలనెదే ఆర్.ఎస్.ఎస్. చెప్పేది అని గుర్తు చేశారు.

” దేశం కోసం మనం ఏమిచ్చామన్నదే ముఖ్యం. వ్యక్తి నిర్మాణంతోనే సంఘ నిర్మాణం జరుగుతుంది.‌ ఎంతో మంది విదేశీయులు మన దేశాన్ని పాలించారు. దోచుకున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలది‌” అని అన్నారు. చరిత్రలో దేశాన్ని కాపాడే మహాయోధులను తోటివారే దెబ్బతీశారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దేశాన్ని దెబ్బతీసేవారిని ఇప్పటికీ చూస్తున్నామని,దేశాన్ని పాలించేవారికి దేశభక్తి వుండాలని స్పష్టం చేశారు.

ప్రపంచంలోని అనేక సవాళ్లకు హిందూత్వమే సమాధానమని, దేశంలో వు‌న్న కుటుంబ వ్యవస్ధ ఒక అద్బుతమైన ప్రయోగశాల అని పేర్కొన్నారు. అమెరికా నేడు కుటుంబ వ్యవస్ధను కోరుకుంటోందని, మన సంస్కృతిపట్ల, సాంప్రదాయాల గురించి మన భావితరాలకు తెలియజెప్పాలని అన్నారు.స్వదేశీ భావన ఉపన్యాసాలతో సాధ్యంకాదని, కార్యాచరణ అవసరమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
మతం పేరుతో భూభాగాన్ని పోగొట్టుకున్నామని, మళ్లీ ప్రాంతీయ బేధాలు సృష్టించి విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

“ఒకదేవాలయం మీద ఆధారపడి పది మంది జీవిస్తున్నారు.కనిష్టంగా పది మంది నుంచి గరిష్టంగా 20 వేల ఉద్యోగాలు ఇచ్చే దేవాలయాలున్నాయి. తిరుమల వల్ల ఆర్టీసీ డిపో బతుకుతోంది. కుంభ మేళాలో 3 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది.‌ దేవాలయాల వల్ల ఎకనమిక్ రివల్యూషన్లు వచ్చాయి. దేవాలయాలు హిందూ సమాజాన్ని మేలుకొలిపే శక్తి కేంద్రాలు అని అన్నారు.పర్యావరణ సమతుల్యత మన సంస్కృతిలోనే వుందని నదులను తల్లులుగా భావిస్తామని,వాటిని కాపాడుకుంటామని,పూజలు చేస్తామని అన్నారు.

అంతకుముందు స్వయంసేవకులు నగరంలో పద సంచలన్ చేసి విన్యాసాలు జరిపారు. అత్యంత క్రమశిక్షణతో జరిగిన ఈ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది.