
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూతురు ఐరా ఇటీవల హోలీ వేడుకల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ప్రముఖ మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నెల 6న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో షమీ కూల్‌డ్రింక్ తాగుతూ కనిపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన షరియత్ నియమాలను పాటించాలని సూచించారు. అంతేకాదు షరియత్ దృష్టిలో షమీ నేరస్థుడని రజ్వీ ఘాటు విమర్శలు చేశారు. ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరని.. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే ఇస్లామిక్ చట్టం ప్రకారం అతన్ని పాపిగా పరిగణిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. దేశం కోసం క్రికెట్ ఆడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మౌలానా షాబుద్దీన్ రజ్వీకి సూచించారు. ఈ సంగతి మర్చిపోకముందే తాజాగా మరోసారి షమీని టార్గెట్ చేశాడీ ఛాందసవాది మత గురువు. షమీ కూతురు ఐరా హోలీ ఆడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని మౌలానా తీవ్రంగా తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాన్ పై కూడా మౌల్వీ మండిపడ్డారు. ‘ఐరా లాంటి చిన్నారి రంజాన్ మాసం ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాంకు వ్యతిరేకం’ అంటూ ఓ వీడియో సందేశాన్ని పంపాడు మౌల్వీ. ఏదిఏమైనా, ఈ వ్యవహారం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లాం ఎందుకు అంత మతోన్మాదంగా, నిర్బంధంగా ఉందని క్రీడాలోకం విస్తుపోతోంది.





