News

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు విజయవంతం : డీఎస్పీ రామంజి నాయక్‌

443views

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల విజయవంతంగా ముగిసాయని ఆత్మకూర్‌ డీఎస్పీ రామంజి నాయక్‌ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహా శివరాత్రికి ప్రణాళికబద్ధంగా బందోబస్తు నిర్వహణ చేపట్టామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు సందర్భాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. బందోబస్తులో భాగంగా సుమారు 2,500 మంది పోలీసులు పాల్గొన్నారని వివరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించామని తెలిపారు.

ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 800 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ , 8 డ్రోన్లను వాడడం జరిగిందన్నారు. మహా శివరాత్రి వేడుకలను విజయవంతం చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు ప్రసాద రావు , చంద్రబాబు పాల్గొన్నారు.