
తెలుగు భాషోన్నతికి పటిష్ట ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పలువురు పేర్కొన్నారు. తెలుగు అధ్యయన శాఖ- ప్రాచ్య పరిశోధన సంస్థ- బెంగళూరులోని తెలుగు సంపద సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడవ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలను తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో వీసీ అప్పారావు ప్రారంభించారు. సినిమా, మీడియా రంగాల్లో తెలుగుదనం తగ్గి ఆంగ్లత్వం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచ సాహిత్య ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెలుగు రచనలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. ఉన్నవ లక్ష్మీ నారాయణ మాలపల్లె నవల, గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం ఇందుకు నిదర్శనమన్నారు. తెలుగులో ఇప్పటికీ కథకు ఆదరణ ఉండటం వల్లే వారానికి వందకు పైగా పత్రికల్లో అచ్చవుతున్నాయని తెలిపారు.
భాష పరిరక్షణ పట్ల అందరూ ఐక్యంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య కృష్ణమూర్తి అన్నారు. బోధన, అధికారిక కార్యకలాపాల్లో తెలుగు ప్రాధాన్యం మరింతగా పెరగాలని హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. తెలుగు ప్రాంతానికి వెలుపల వివిధ కళా రూపాలు, సంప్రదాయాలు, ఆచారాల రూపంలో తెలుగు భాష కనిపిస్తోందని తెలుగు భాషా పరిశోధకుడు స.వెం. రమేష్ అన్నారు. మిగతా రాష్ట్రాల్లో.. విదేశాల్లోనూ తెలుగు భాషను కాపాడుతున్నది సామాన్య ప్రజలేనని తెలిపారు. ధారణ శక్తి వల్ల ఎవరైనా చురుగ్గా ఆలోచిస్తారనీ, తెలుగు పద్యాలు ఇటువంటి ధారణకు తోడ్పడతాయని ఎస్కేయూ విశ్రాంతాచార్యుడు శలాక రఘునాథశర్మ పేర్కొన్నారు. మూడు సమాంతర సదస్సుల్లో వివిధ ప్రాంతాల ప్రతినిధులు పరిశోధనా పత్రాలను సమర్పించారు.





