News

ఆంధ్రాలో 60 అడుగుల ఆదియోగి విగ్రహం ప్రారంభానికి సిద్ధం

258views

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిచెందిన అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని శివరాత్రికి ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తయినవి ఉండగా ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో మూడో అతిపెద్ద విగ్రహం రూపుదిద్దుకుంటుంది. ఈనెల 26న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5.30 గంటలకు విగ్రహం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో లోపలకు ప్రవేశమార్గం ఉంది. అందులో శివలింగం ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ధ్యానం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

దేవతలు.. మహర్షులు కొలువుదీరేలా..
ఆదియోగి విగ్రహానికి ఎదురుగా వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు నమస్కరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు పక్కల వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప బ్రహ్మరుషి, భరద్వాజ మహర్షి, జమదగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి విగ్రహాలు ధ్యానం చేస్తున్నట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో అర్ధనారీశ్వర విగ్రహం, వినాయకుడు,
కుమారస్వామి, నటరాజ విగ్రహాలు, కృష్ణార్జునుల, అనంత పద్మనాభస్వామి, నంది విగ్రహాలున్నాయి.

వేగంగా పూర్తి చేశాం
కర్ణాటక రాష్ట్రంలో ఆదియోగి విగ్రహాన్ని దర్శించడానికి వెళ్లినప్పుడు ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో కూడా నెలకొల్పితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన శిల్పి కొల్లి వీరరాఘవతో మాట్లాడి విగ్రహం ఏర్పాటు చేయడానికి అంకురార్పణ చేశాం. దాతల సహకారంతో సుమారు రూ.40 లక్షలతో విగ్రహం ఏర్పాటు, సుందరీకరణ, విద్యుత్‌
వెలుగులు తదితర నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశాం. – ఎస్‌. ఎల్‌.కనకరాజు గురుస్వామి, ఆలయ వ్యవస్థాపకుడు, ద్వారపూడి

తొమ్మిది నెలల సమయం..
5 టన్నులు ఇనుము, 7 లారీల ఇసుక, 1200 బస్తాల సిమెంటు, 2 లారీల కంకర, 25 వేల ఇటుకలతో 9 నెలల కాలవ్యవధిలో విగ్రహం తయారు చేశాం. సిమెంటులో నలుపు రంగు మెటీరియల్‌ కలపడంతో సుమారు 15 సంవత్సరాల వరకు విగ్రహం రంగు మారడం జరగదు. ఎటువంటి పగుళ్లు రావడానికి ఆస్కారంలేదు.– కొల్లి వీరరాఘవ, శిల్పి, కొమరిపాలెం