ArticlesNews

వాస్తవిక సోమనాథ్ జ్యోతిర్లింగం పునర్జీవనం – ఓ ఆసక్తికరమైన కథ: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

314views

భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం శాశ్వతమైనది. మన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా మన ఆలయాలు, ధర్మ గ్రంథాలు, సంప్రదాయాలపై ఎన్నో ఆక్రమణలు జరిగాయి. అయినా సరే మన నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. మన నాగరికత, సంస్కృతి ప్రాధాన్యతను తెలిపే ఒక కథను గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. అది ఆయన మాటల్లోనే..

‘‘12 జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది భక్తికి చిహ్నం. సోమనాథ్ దేవాలయం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక శక్తికి భాండాగారం లాంటిది. దేశవ్యాప్తంగా భక్తులు, సాధువులు, అన్వేషకులను ఈ దేవాలయం ఆకర్షించేది. సోమనాథ్ జ్యోతిర్లింగం చాలా అద్భుతమైనది. ఇది భూమిని తాకకుండా గాలిలోనే ఉండేది. ఈ జ్యోతిర్లింగం నుంచి వెలువడే దైవ శక్తి అక్కడికి వచ్చే భక్తులను ఎంతో ప్రభావితం చేసేది. ఈ పవిత్ర శక్తి కేవలం మన నమ్మకానికి సంబంధించినదే కాదు, ఇది ఒక అనుభవం కూడా. క్రీ.శ 1025లో మహమ్మద్ గజనీ.. సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి, శివలింగాన్ని ముక్కలుగా చేసి అపవిత్రం చేశాడు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఈ శివలింగం ముక్కలైనప్పటికీ భక్తుల్లో దీని పట్ల భక్తి భావం ఏ మాత్రం తగ్గలేదు. మన ప్రాచీన సంప్రదాయాలను గౌరవించే అగ్నిహోత్రి బ్రాహ్మణులు ఈ మూల శివలింగం ముక్కలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని సంరక్షించారు. ఈ అగ్నిహోత్రి బ్రాహ్మణులు శివలింగం ముక్కలను ఎంతో గోప్యంగా ఉంచి, వాటిని గత వెయ్యేళ్లుగా సంరక్షిస్తూ, తరతరాలుగా పూజిస్తున్నారు.

పవిత్ర శివలింగానికి సంరక్షకులు
ఎన్నో శతాబ్దాలుగా ఈ శివలింగం శకలాలు దాగి ఉన్నాయి. వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గొప్ప సాధువులు, ఆధ్యాత్మిక సంరక్షకులు వీటిని భద్రపరచారు. శకలాలను పవిత్ర లింగం ఆకారంలో మలిచి పూజించారు. గత శతాబ్దం మొదటి అర్ధ భాగంలో గురు శిష్య సంప్రదాయం ప్రకారం స్వామి ప్రణవేంద్ర సరస్వతికి ఆయన గురువు ఈ శివలింగాలను ఇచ్చారు. స్వామి ప్రణవేంద్ర సరస్వతి ఈ శివలింగాలను కంచి శంకరాచార్య అయిన స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి వద్దకు తీసుకుని వెళ్లారు. కంచి శంకరాచార్య ఈ శివలింగాలను వందేళ్ల పాటు గోప్యంగా ఉంచమని చెప్పారు. తదనంతరం ఈ శివలింగాలు సీతారాం శాస్త్రి కుటుంబ సభ్యుల సంరక్షణలోకి వచ్చాయి. వందేళ్ల నిరీక్షణ ముగిసిన తర్వాత ఈ శివలింగాలను సీతారాం శాస్త్రి ప్రస్తుత కంచి శంకరాచార్య అయిన స్వామి విజయేంద్ర సరస్వతి వద్దకు తీసుకుని వెళ్లారు. శంకరాచార్య ఈ శివలింగాలను నాకు అప్పగిస్తే వాటి పునఃస్థాపన జరుగుతుందని సీతారాం శాస్త్రికి సూచించారు. చిన్న శివలింగాలను వస్త్రంలో చుట్టి సీతారాం శాస్త్రి నా దగ్గరకు తీసుకొని వచ్చారు. వాటిని చూడగానే వీటికి అద్భుతమైన అయస్కాంత శక్తి ఉందని నాకు అర్దమైంది.

నమ్మకం ఉండాలని మనం చెబుతుంటాం. అలాగే నమ్మకం ప్రత్యక్ష అనుభవంగా మారిన సందర్భాలూ ఉంటాయి. ఈ చిన్న శివలింగాలను పట్టుకున్నాక వాటికి ఉన్న అద్భుతమైన శక్తి అనుభవంలోకి వస్తుంది. ఇదే రకమైన అద్భుతమైన శక్తి ఒకప్పుడు సోమనాథ్ ఆలయంలో వాస్తవ జ్యోతిర్లింగానికి కూడా ఉండి ఉండొచ్చు. ఇవి కేవలం రాతి ముక్కలు కావు. వీటిలో మంత్ర శక్తి ,ఎన్నో శతాబ్దాలుగా చేసిన ప్రార్థనలు, ధ్యానం, ఆచారాల సామూహిక శక్తి నిండి ఉంది. 2007లో శాస్త్రవేత్తలు ఈ శివలింగాలపై అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. శివలింగం మధ్య భాగంలో అయిస్కాంత శక్తి ఉందని గుర్తించారు. ఇది చాలా అద్భుతమైన విషయం. శివలింగం ఆలయంలో గాలిలో తేలి ఉండడానికి ఈ అయస్కాంత శక్తి కారణమై ఉంటుందని వారు కనుగొన్నారు. ఇటువంటి అయస్కాంత గుణం ఉన్న శిలలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ శివలింగం ఒక స్పటిక నిర్మాణం అయినప్పటికీ ఇది చాలా అరుదైనదని తెలిసింది. ఇటువంటి శిలలు భూమి మీద ఏనాడు కనిపించలేదు. మన ప్రాచీన గ్రంథాలను చూస్తే ఇవి అంతరిక్షం నుంచి ఉల్కల రూపంలో భూమి మీదకు వచ్చి ఉంటాయని చెబుతారు.

ఈ శివలింగాలను తిరిగి పొందడమనేది సాధారణమైన విషయం కాదు. చరిత్రను తిరిగి రాసినట్లే. ఇది మన నాగరికతను, నమ్మకాన్ని పునరుద్ధరించినట్లే. 500 ఏళ్ల తరువాత అయోధ్యలోని రామాలయం పునర్నిర్మించినట్లే.. 1,000 సంవత్సరాల తరువాత వాస్తవిక సోమనాథ్ లింగం కీర్తి తిరిగి వెలుగులోకి రావటం చూస్తున్నాం. ఇది సనాతన ధర్మం శాశ్వత స్వభావాన్ని నిర్ధారించే క్షణం. సనాతన ధర్మం ఇప్పటికీ జీవించి ఉంది. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ శ్వాస తీసుకుంటున్న ఒక సంప్రదాయం. ఈ ఆశీర్వాదాన్ని ప్రతిచోటా భక్తులకు పంచటం మా కర్తవ్యం. సోమనాథ్ దేవాలయంలో వీటిని పునరుస్థాపన చేయటానికి ముందు ఈ శివలింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలకు, దేవాలయాలకు, పవిత్ర స్థానాలకు తీసుకుని వెళ్తాం. ఇలా చేయడం వల్ల భక్తులకు వీటి దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే భగవంతుని శాశ్వతమైన ఉనికిని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది.

ఆధ్యాత్మికత నిజమైన సారం అన్నిటికీ అతీతమైనది. వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకి ప్రతీక. అలాగే శివునికి సామీప్యంగా ఉంటాడు. అందుకే శివుడిని.. చంద్రునికి అధిపతి సోమనాథ్ అంటారు. కలత చెందే మనసుకు శివుడే సమాధానం. ఈ పవిత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు, శివుడు కేవలం విగ్రహం లేదా చిహ్నం కాదని మనం గుర్తుంచుకోవాలి. శివుడు ఒక అనుభవం. శివుడు మన ఆలోచనల వెనుక ఉన్న మౌనం, మన భావాల యొక్క విశాలత, సర్వ వ్యాప్తమైన చైతన్యం. ఈ జ్యోతిర్లింగం తిరిగి వెలుగులోకి రావటం కేవలం ఒక చరిత్రాత్మక ఘటన మాత్రమే కాదు. ఇది ఒక సందేశాన్ని తెలియజేస్తుంది – సత్యం, నమ్మకం, భక్తిని ఎవరు వినాశనం చేయలేరు’’ అని వివరించారు.