ArticlesNews

సనాతన సాంస్కృతిక వారధి, హిందూ ధర్మ సారథి స్వామి దయానంద సరస్వతి

252views

( ఫాల్గుణ కృష్ణ పక్ష దశమి తిథి – స్వామి దయానంద సరస్వతి జయంతి )

మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఓ బాలుడు ఆలోచించాడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసులో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలను అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి వివక్ష, అంటరానితనం లేదని, వేదాల వైపు మరలండి అని ఆయన ఇచ్చిన పిలుపు ఓ తరాన్ని కదిలించింది. భారతీయుల కోసం భారతదేశం అని నినదించిన ఆ మహా మనీషి మరెవరో కాదు స్వామి దయానంద సరస్వతి.

భారతదేశంలో ఎందరో సంస్కర్తలు వచ్చినా, కాలక్రమంలో ధర్మంలో అనేక అనాచారాలు, దురాచారాలు ప్రబలాయి. వ్యక్తి గుణకర్మలను బట్టి నిర్ణయించే వర్ణం, జన్మత: నిర్ణయించడం మొదలుపెట్టారు. అంటరానితనం అనే దురాచారం వచ్చింది. బాల్య వివాహాలు, సతిసహగమనం కూడా సమాజాన్ని పట్టి పీడించాయి. అనవసరమైన, కుతర్కమైన మూఢనమ్మకాలతో భారతావని ఎన్నో బాధలు అనుభవించింది. ప్రజల్లో చైతన్యాన్ని, క్రియాశీలత్వాన్ని నింపాల్సిన ధర్మప్రబోధం, అకర్మను, తమస్సును నింపింది. అటువంటి సమయంలో, సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ కృష్ణ పక్ష దశమి తిథి నాడు గుజరాత్ కఠియావాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో దయానంద సరస్వతి జన్మించారు. ఈ సందర్భాన్ని నేడు అంటే ఫిబ్రవరి 23న జరుపుకుంటున్నాము. మహర్షి దయానంద సరస్వతి పూర్వ నామం మూలశంకర. ఈయన తల్లి పేరు శుద్ద చైతన్య, తండ్రి పేరు కర్సన్ దాస్ తివారీ. చిన్నవయసులోనే సత్యాన్వేషణతో ఇల్లు వదిలిన మూలశంకరుడు, అనేక ప్రాంతాలను తిరిగి ఆఖరికి మథురలో స్వామి విరాజానంద అనే సన్యాసి వద్ద శిష్యరికం చేశారు. విరజానందుడు అంధుడే అయినా, జ్ఞాన దృష్టి కలవాడు. సమాజంలో చెప్పబడుతున్న వేదప్రోక్తమైన సనాతన ధర్మం కాదని, అసలు ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, ఆ పనిని దయానందునికి అప్పగించారు విరజానందుడు. అప్పటి నుంచి దయానందుడు భారతదేశ నిర్మాణానికి, సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు.

బ్రిటిష్ పాలనలోని భారతదేశం హిందువుల బానిసత్వానికి తోడుగా అనేక సామాజిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం, సనాతన ధర్మం ఇప్పుడు స్వీయ నాశనం దిశగా వెళ్లడాన్ని చూసి చలించిన దయానందుడు 1867లో పాఖండ ఖండిని పతాకాన్ని ఆవిష్కరించి దురాచారాలపై పోరాటం ప్రారంభించారు. హిందూ సమాజంలో అజ్ఞానం, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలతో కూడిన విగ్రహారాధన, జంతుబలులు, అంటరానితనం, సతీసహగమనం, బాల్యవివాహాలు, వరకట్నం వంటి దురాచారాలకు కారణం సనాతన ధర్మ మూలాలను మరవడమేనని దయానంద సరస్వతి చెప్పారు. హైందవ సమాజాన్ని వేదమార్గం వైపు తీసుకెళ్లడం లక్ష్యంగా 1875 ఏప్రిల్ 10న ముంబైలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. కృణ్వంతో విశ్వమార్యం అనేది ప్రధాన నినాదం. ఆర్యసమాజం చేపట్టిన కార్యక్రమాల్లో శుద్ధి ఉద్యమాలు చాలా ప్రాచుర్యం పొందాయి. శుద్ధి ఉద్యమం ఫలితంగా ఇస్లాం, క్రైస్తవ మతాల్లో చేరిన ఎంతోమంది హిందూ సోదరులు తిరిగి హిందువులుగా మారారు. హైదరాబాద్ సంస్థాన విముక్తిలో ఆర్యసమాజ్ పాత్ర చాలా ఉంది.

దయానంద సరస్వతి తన బోధనలను సత్యార్థ ప్రకాశ్‌లో పొందుపరిచారు. 1874లో రాసిన ఈ గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. సనాతన వైదిక ధర్మం విశిష్టతను సత్యార్థి ప్రకాశంలో దయానంద చాటి చెప్పారు. ఇతర మత గుణగుణాలను విశ్లేషించారు. వాటిలోని దురాచారాలను ఎండగట్టారు. దేశ దుస్థితికి బ్రిటిష్ పాలన కూడా కారణమని గుర్తించిన దయానంద సరస్వతి సంపూర్ణ స్వరాజ్యం రావాలని చాటి చెప్పారు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తెరవెనుక పాత్రను పోషించారు. గోవధను నిషేదించాలని చెప్పిన వారిలో అగ్రగణ్యులు దయానందులవారు. సత్యమే ప్రమాణంగా ప్రచారం చేసిన దయానంద పై ఎన్నోసార్లు విషప్రయోగాలు జరిగాయి. 1883లో జోధ్‌పూర్ మహారాజా ఆహ్వానం మేరకు దయానంద సరస్వతి అతిథిగా వెళ్లారు. అక్కడి వంటవాడు దయానంద తాగే పాలలో విషం కలిపాడు. ఆ పాలు తాగి అస్వస్థతకు గురైన స్వామి దయానంద సరస్వతి 1833 అక్టోబరు 30న ఓంకార నాదంతో మహాసమాధి పొందారు.

దయానంద జీవించింది 59 ఏళ్లే అయినా జాతీయవాదిగా తన బోధనలతో భారతదేశాన్ని సాంఘికంగా, మతపరంగా సంఘటిత పరచి ప్రజలలో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా అవిరళ కృషి సల్పి, హిందూధర్మానికి దయానందులు చేసిన సేవ ఎందరో సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది. సత్యం, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం స్వామి దయానంద సరస్వతి గారు చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినింపుతూనే ఉంటుంది.