ArticlesNews

సముద్రగర్భంలో ద్వారక ఆనవాళ్ళపై అధ్యయనం

251views

ద్వారకలో శ్రీకృష్ణుడు నడియాడిన ఆనవాళ్ల పై పురావస్తు శాఖ మరోసారి అధ్యయనం చేయనుంది. వేణుమాధవుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. పరిశోధన కోసం గోమతి నదీ సమీప ప్రాంతాన్ని పురావస్తు నిపుణులు ఎంచుకున్నట్టు అధికారులు తెలిపారు

దాదాపు రెండు దశాబ్దాల అనంతరం కృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించిన మరిన్ని విశేషాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ప్రయత్నిస్తోంది. సముద్రగర్భంలో మునిగిన సుందర ద్వారకపై ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మరోసారి సమగ్ర సర్వేకు సిద్ధమైంది.

ఆర్కియాలజీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఫ్రొఫెసర్ అలోక్‌ త్రిపాఠి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. వీరిలో ముగ్గురు మహిళా ఆర్కియాలజిస్టులు అపరాజిత శర్మ, పూనమ్‌ వింద్‌, రాజ్‌కుమారి బర్బినా ఉన్నారు.

జరాసంధుడి దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు గాను శ్రీకృష్ణుడు మధురను వీడి, గోమతీ నదీ – అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి వలస వెళ్లినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవశిల్పి విశ్వకర్మ సాయంతో అక్కడ ద్వారక నగరాన్ని నిర్మించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది.

మొదటిసారిగా హిరానంద్‌ శాస్త్రి 1930లో ద్వారక రహస్యాలు వెలుగులోకి తెచ్చారు. 1963లో జేఎం నానావతి, హెచ్‌డీ సంకాలియా ఆధ్వర్యంలో ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969-70, 1983-1990 మధ్య సముద్రగర్భంలో శ్రీకృష్ణుడి కాలం నాటి అవశేషాలు గుర్తించారు. సముద్రగర్భంలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన ఒక నగర అవశేషాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని 2005-07లోనూ యూఏడబ్ల్యూ ఆధ్వర్యంలో జరిగిన అన్వేషణలో తేలింది.