
కుంభమేళా అంటే ముక్తిమేళా అని పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అభివర్ణించారు. ఇది మనిషిని దేవుడితో అనుంసంధానించే వంతెన వంటిదని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్ మృత్యుకుంభ్‌గా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల విమర్శలు చేసిన నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘నేను ఎలాంటి వివాదంలో వేలు పెట్టాలనుకోవడం లేదు. ఆయా సందర్భాల్లో తన పదవి రీత్యా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఏ ముఖ్యమంత్రికి అయినా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ గొప్ప లక్షణాన్ని నేను స్వాగతిస్తున్నాను’’ అని కోల్ కతాలోని రాజ్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ వెల్లడించారు. ‘‘నాకు సంబంధించినంత వరకు గవర్నర్‌గా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. భక్తిపూర్వకంగా ఆ ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లాను’’ అని పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో ఆనందబోస్ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.





