
సంస్కార భారతి విజయవాడ మహానగర్ శాఖ, సుమధుర కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలు ఫిబ్రవరి 22, 23న నిర్వహిస్తున్నట్టు సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ప్రవేశరుసుము లేకుండా పూర్తి సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కూచిపూడి, ఆంధ్ర నాట్యం, భరత నాట్యం మూడు విభాగాల్లో పోటీలుంటాయన్నారు. ప్రతి నాట్యంలోను వ్యక్తిగత విభాగంలో సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తామన్నారు. బృంద విభాగంలో శాస్త్రీయ నృత్య విభాగం (క్లాసికల్ గ్రూప్ డాన్స్), జానపద నృత్య విభాగం (ఫోక్ గ్రూప్ డాన్స్) అనే రెండు విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వ్యక్తిగత విభాగంలో 314 మంది కళాకారులు, బృంద విభాగం నుంచి 40 బృందాలు (240 మంది కళాకారులు) అన్ని విభాగాల నుంచి 564 మంది కళాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోనున్నారన్నారు. లబ్ద ప్రతిష్టులైన అనేకమంది గురువులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు.
22న శనివారం కేబీఎన్ కళాశాలలో మూడు వేదికలు, హనుమంతరాయ గ్రంథాలయం, గాంధీనగర్, శ్రీ ధర్మ పరిషత్ అయోధ్యనగర్, సీతారామ కల్యాణ మండపం సత్యనారాయణపురం మొత్తం ఆరు వేదికలపై ఈ పోటీలు జరుగుతాయన్నారు. 23న ఆదివారం శ్రీ ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో గోకరాజు లైలా గంగరాజు కళావేదికపై బృంద నృత్యాలు పోటీ, 6.45 నిమిషాలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుందన్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ పి.తేజస్వి, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ ఎస్‌పీ భారతి, చలువాది మల్లిఖార్జునరావు, సీబీఆర్ ప్రసాద్, ఎంసీ దాస్, కేబీఎన్ కళాశాల సెక్రటరీ టి.శ్రీనివాస్ హాజరవుతారని కృష్ణ తెలిపారు.





