
ప్రపంచంలో ఏ భాషకు లేని సౌలభ్యం, ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉందని, చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి మద్దిపట్ల వెంకటరమణ అభివర్ణించారు.మాతృభాషా దినోత్సవం సందర్భంగా, శుక్రవారం చిత్తూరు పిసిఆర్ హైస్కూల్లో, విద్యార్థులకు తెలుగు భాషలో పలు పోటీలు నిర్వహించి, బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరుకు చెందిన తెలుగు సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు పైనేని తులసినాదం నాయుడు, వారి సంస్థ తరపున విద్యార్థులకు, 5000 నీతి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దిపట్ల వెంకటరమణ మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమం ఆదిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి, తమ సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకు వస్తున్నా మని, తెలుగు సాహితి సంస్కృతి సమితి అధ్యక్షుడు తులసీనాధం నాయుడు తెలిపారు.





