News

దేవాలయాలతోనే సనాతన ధర్మానికి రక్ష

332views

హిందూ దేవాలయాలు శక్తికి, సంపదకు కేంద్రాలని.. సనాతన ధర్మపరిరక్షణ దేవాలయ వ్యవస్థతోనే సాధ్యమని.. అయితే ప్రభుత్వాలు ఆలయాలను, వాటి ఆస్తులను నియంత్రణలోకి తీసుకోవడంతో నష్టం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ – వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరాండే, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్‌-2025)లో రెండోరోజైన మంగళవారం వీరు పాల్గొన్నారు. మిలింద్‌ పరాండే మాట్లాడుతూ దక్షిణాదిలోని వేల హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని, దేశానికి స్వాతంత్య్రం లభించినా వాటికి మాత్రం లేదన్నారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వాల అజమాయిషీని తప్పించి స్వయంగా నిర్వహించుకునేలా అన్ని రాష్ట్రాల సీఎంలకు వినతులు ఇస్తున్నామని చెప్పారు. అన్నిరంగాల ప్రముఖులతో ధార్మికరాజ్య పరిషత్, హిందూ సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామన్నారు.
హెచ్‌ఆర్‌సీఈ రద్దు కావాలి

హిందూ ఆలయాల ఆస్తులపై పెత్తనం చేస్తూ, వాటి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్న హిందూమత ధార్మిక చట్టాల పాలకసంస్థలు (హెచ్‌ఆర్‌సీఈ) రద్దుకావాలని తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. తమిళనాడులో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే హెచ్‌ఆర్‌సీఈ చట్టాన్ని రద్దుచేసి, దాని కింద ఉన్న 44,121 దేవాలయాలకు విముక్తి కల్పిస్తామన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వారందరినీ కలిపేలా టెంపుల్‌ కనెక్ట్‌ సదస్సు ఉపయోగపడిందన్నారు. ఎప్పటికైనా టెంపుల్‌ సిటీలే నిలదొక్కుకుంటాయని, ఇందుకు వెయ్యేళ్ల చరిత్ర కలిగి మనముందు ఠీవిగా ఉన్న వారణాసి, మదురై, ఉజ్జయిని, పుష్కర్‌ వంటి నగరాలే ఉదాహరణ అని చెప్పారు.