ArticlesNews

విజయగాథకు నిదర్శనం -శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం

262views

శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్యకేంద్రం విజయగాథకు నిదర్శనంగా నిలి చిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కుష్టు వ్యాధి
వ్యాధిగ్రస్థులకు సేవ చేయడానికి దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఉద్భవించిన ఈ కేంద్రం చేసిన కృషి అభినంద నీయమన్నారు. అనితర సాధ్యమైన సేవతో కూడిన ఈ విజయగాథను ప్రపంచానికి తెలియజెప్పాలని మంత్రి దుర్గేష్ సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం కుష్టురోగుల పునరావాస కేంద్రం 49వ వార్షికోత్సవం, శ్రీ వివేకానంద చారిటబుల్ కేంద్రం 24వ వార్షికోత్సవం సంయుక్తంగా ఫిబ్రవరి 2న కేంద్రం ఆవరణలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడి శ్రీ సూర్య మందిరంలో పూజలు నిర్వహించి అక్కడున్న గోశా లను సందర్శించారు. కేంద్రం అధ్యక్షుడు పతివాడ రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన సభకు కేంద్రం సంయోజకులు ఓలేటి సత్యనారాయణ స్వాగతం పలికారు.

జ్యోతిప్రజ్వలన అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆరోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కుష్టు వ్యాధితో బాధపడేవారికి అక్కున చేర్చుకుని ఈ వ్యాధి రూపుమాపడానికి ఈ కేంద్రం ద్వారా చేసిన కృషి సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ఉత్తమ సంకల్పశుద్ధితో వివేకానంద స్పూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో ఒడుదుడుకులు అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని అభినందించారు. ప్రస్తుతం మహారోగ ప్రభావంలేనందున వేరే సేవాకార్యక్రమాలు కొనసాగించేలా ఈ కేంద్రం కృషిచేయాలని కూడా భావించడం, ఇక్కడ ఉన్న క్లినిక్ ని సమగ్ర కేంద్రంగా చేయాలని చూడడం అభినందనీయమని అన్నారు. ఇందుకు తనవంతు సహకారం ఉంటుందని ప్రకటించారు.

కేంద్రం వ్యవస్థాపకసభ్యుడు ఆర్ కె జైన్ మాట్లా డుతూ, ప్రదీప్తి సంస్థ ద్వారా ఆనాటి కలెక్టర్ యుబి రాఘవేంద్రరావు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ సేవ ప్రారంభించామని, మండవిల్లి మల్లికార్జునరావు, కేతా అప్పారావు కేంద్రానికి మంచి ఊతమిచ్చారని వివరిం చారు. ఆ రోజుల్లో పడిన కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతప్రచారక్ విజయాదిత్య ప్రసంగిస్తూ భారత దేశం ప్రపంచదేశాలకు భిన్నమైందన్నారు. అన్ని దేశాల అభివృద్ధికి ధనం పెట్టుబడి అయితే, భారత్ కు సేవ, సమర్పణ భావం, త్యాగం, ఉన్నత విలువలు నిదర్శనంగా ఈ కేంద్రం కన్పిస్తోందని అన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలు ఏమిటో అన్వేషించి, అందుకు తగ్గ సేవలు అందిస్తూ ప్రేరణదాయక సంస్థగా ఈ కేంద్రం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

దేశంలో ఇలాంటి సేవా భావం గల సంస్థలు ఉండడం వల్లనే జాతీయాభివృద్ధికి దోహదం అవుతోందన్నారు. సమాజంలో అసమానతలు, తొలగించే ప్రయత్నం చేస్తేనే భారత్ విశ్వగురువు అవుతుందని పేర్కొన్నారు. ఆ దిశగా దేశంలో మార్పులు జరుగుతూ అభివృద్ధిపథంలో పరుగులు పెడుతోందన్నారు.

ఆత్మీయ అతిధిగా పాల్గొన్న జిఎస్ ఎల్ కేన్సర్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. గోగినేని తరుణ్ చౌదరి మాట్లాడుతూ నెలకొకసారి ఈ కేంద్రంలో భోజన ఏర్పాట్లలో, మెడికల్ చెకప్ పనిలో పాలుపంచు కుంటామని జిఎస్ ఎల్ చైర్మన్ డా. గన్ని భాస్కరరావు పక్షాన హామీ ఇస్తున్నట్లు చెప్పారు.

ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కేంద్రంలో కుష్టురోగులు లేరని, ఆ వ్యాధి తగ్గినప్పటికీ వికలాంగులుగా మిగిలిన వారు ఉన్నారని, వారందరి యోగ క్షేమాలు వదాన్యుల సహకారంతో చూస్తున్నామని చెప్పారు. మార్పులకు అనుగుణంగా కుట్టు శిక్షణకేంద్రం పెట్టబోతున్నామని, అలాగే స్కిల్ డవలప్మెంట్ కేంద్రంగా చేయాలని భావిస్తున్నామని వివరించారు. ఇక్కడ క్లినిక్లో 16 ఏళ్లు సేవలందించిన స్వర్గీయ డా||ఎం. జగన్నాథం ఔదార్యం గురించి తులసి సూర్యప్రకాష్ వివరించారు.

ఈ సందర్భంగా జగన్నాథం సతీమణి భాస్కరంను సత్కరించారు. సోమశేఖర్, సుంకవల్లి రామకృష్ణ, తపన చౌదరి, డా. కర్రి రామారెడ్డి, చిట్టురి ప్రకాష్, డా. పిల్లాడి పరమహంస, మంతెన రామ చంద్రరాజు, రిమ్మల పూడి సుబ్బరాజు, మద్దిపోటి శంభాజీరావు, మత్సేటి శివప్రసాద్, కామిని ప్రసాద్ చౌదరి, కార్యకర్తలు, గ్రామస్తులు, పాల్గొన్నారు. మేనేజర్ కేతా వరప్రసాద్ వందన సమర్పణ చేశారు.