News

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధమున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

257views

ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలగించారు. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ ముగ్గుర్ని తొలగించారు. ఎల్జీ మనోజ్ సిన్హా అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ లో భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో జమ్మూ కశ్మీర్ ఉన్నత ఉద్యోగులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.

ఇస్లామిక్ ఉగ్రవాదుల కనుసన్నల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యవస్థల్లో పేరుకుపోయిన వారిపై కన్నేయాలని, వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలని, మట్టుబెట్టడానికి చర్యలను ముమ్మరం చేయాలని ఎల్జీ అధికారులను ఆదేశించారు.

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న వారు, వారి లక్ష్యాల కోసం పనిచేసే వారిపై కన్నేయాలని, వారు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మనోజ్ సిన్హా ఈ సమావేశంలో అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.‘‘ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు, వారి లక్ష్యాల కోసం పనిచేసేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన ఉద్యోగులు అలా కాకుండా, ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నారని ,ఇది మంచిది కాదన్నారు.

‘‘తిండి పెడుతున్న సంస్థకు, దేశానికే వారు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీనిని ఉపేక్షించేది లేదు’’ అని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు.

ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు..

1. అహ్మద్ భట్: జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా వున్నాడు. LET ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి.

2. నిసార్ అహ్మద్ ఖాన్ : జమ్మూ కశ్మీర్ ఫారెస్ట్ విభాగంలో వున్నాడు. అనంతనాగ్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. ప్రభుత్వంలో పనిచేస్తూ అంతర్గతంగా హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నిర్వహిస్తున్నాడు.

3. మహ్మద్ అష్రఫ్ భట్ : ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. రెసాయ్ ప్రాంతంలో వుంటాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి.