
పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈ ఘటనలో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్ట్‌పై పాక్ సైన్యం జరిపిన కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో శత్రువుల వైపు ‘భారీ ప్రాణనష్టం’ జరిగిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అయితే, మృతుల సంఖ్య వివరాలను మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఈ సమాచారాన్ని భారత సైన్యం ఇంకా ధ్రువీకరించలేదు.
కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన. అయితే, గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య అర్ధరాత్రి కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు హతమవ్వగా.. వీరిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇక, ఫిబ్రవరి 8న రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడికి గాయాలయ్యాయి.





