
ఉచిత పథకాలను (freebies) ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది.
‘‘ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ.. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. ఉచితంగా రేషన్, డబ్బులు అందుతున్నాయి. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతోంది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే. కానీ, వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలి. ఉచితాల ద్వారా అలా జరుగుతోందా..?ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదు’’ అని జస్టిస్ బీఆర్.గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కేంద్రప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉందని.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈసందర్భంగా ధర్మాసనానికి తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పని చేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది.





