
లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్ కుటుంబానికి పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయంటూ బిజెపి ఆరోపించింది. ‘జాతీయ భద్రతతో ముడిపడిన ఆందోళన కలిగించే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్థాన్ ప్రణాళికా సంఘం సలహాదారు అలీ తౌఖీర్ షేక్‌తో, ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయన్న విషయం వెల్లడైంద’ని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు అందించే సంస్థలో ఆమె పనిచేశారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా ఎలిజబెత్‌పై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శలు సంధించారు. విదేశీయురాలైన ఆమె గౌరవ్ గొగొయ్‌తో వివాహానంతరం 12ఏళ్ల వరకు భారతీయ పౌరసత్వాన్ని తీసుకోవడానికి నిరాకరించారని ఆక్షేపించారు.





