
మహా కుంభమేళా వేదికగా వనవాసీ కల్యాణాశ్రమం, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన సాంస్కృతిక సదస్సు జరిగింది. దేశ వ్యాప్తంగా వున్న 120 నృత్య బృందాలు ఈ వేదికపై నృత్యాలు చేశాయి. తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి.చివరి ప్రదర్శన ప్రాగ్జోతిష పురంలో జరిగింది.
ఈ సందర్భంగా వనవాసీ సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రముఖులను వనవాసీ కల్యాణాశ్రమం సత్కరించింది. వివిధ నృత్య ప్రదర్శనలు చేసిన వారికి, వనవాసీ సమాజానికి సేవలందించిన వారిని సత్కరించారు. వనవాసి కళ్యాణ్ ఆశ్రమ జాతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ జీ, ఉపాధ్యక్షుడు డాక్టర్ హెచ్‌కే నాగు వారందర్నీ సత్కరించారు.
కుంభమేళా వేదికగా వివిధ కార్యక్రమాలు
ఈ నెల 6 నుంచి 10 వరకు వనవాసీ కల్యాణాశ్రమం ద్వారా వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా వున్న వివిధ ప్రాంతాల నుంచి వనవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.పెద్ద ఊరేగింపుగా సంగం ఒడ్డుకు చేరుకున్నారు. స్వామి అవధేశానంద ఈ ఊరేగింపును జెండాఊపి ప్రారంభించారు.
వేలాది మంది వనవాసులు నినాదాలు చేస్తూ… పుణ్య స్నానాల కోసం బయల్దేరారు.నాగాలాండ్, మిజోరాం నుండి అండమాన్ మరియు కేరళ నుండి హిమాచల్ నుండి వేలాది మంది గిరిజన భక్తులు తమ సాంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో కాషాయ జెండాలు ధరించి, ఊరేగింపులో పాల్గొన్నారు.10 వేల మంది వనవాసులు అత్యంత క్రమశిక్షణ, భక్తితో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.





