
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చినకళ్లేపల్లి గ్రామంలో కాకతీయుల నాటి శిలా శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటిన చినకళ్లేపల్లికి చెందిన అంగత వరప్రసాదరావు ఈ శిలాశాసనాన్ని ఫొటోలు తీయించి మైసూరు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు. అప్పటి అచ్చ తెలుగు లిపిలో గల అక్షరాలున్న సంగం రాతి స్తంభం మాత్రమే లభించింది.
శక సంవత్సరం 1180 (క్రీ.శ.1280) మేష సంక్రాంతి రోజు చినకళ్లేపల్లిలో ఉన్న నాగేశ్వరస్వామి ఆలయానికి అఖండ దీపం కోసం మల్లయపెద్ది తన ప్రభువు ద్వారా 25 గొర్రెలు ఒకరికి ఇచ్చారు. ఈ గొర్రెలు తీసుకున్న వ్యక్తి అతని వారసత్వం స్వామివారికి నిత్యం నెయ్యి ఇవ్వాలని రాసి ఉన్నట్లు అనుభవజ్ఞులు చెబుతున్నారు.
భావితరాలకు అందించాలి: అంగత వరప్రసాద్
శిలా శాసనాలు, నాణేలు, గుహ, కుడ్యచిత్రాలు గత కాలపు చరిత్రకు ఆనవాళ్లు. చరిత్ర అధ్యయనానికి ఇవి దోహదపడతాయి. ఇలాంటి శాసనాలను అప్పటి పాలకులు రికార్డులుగా పరిగణించాలి. చినకళ్లేపల్లిలో మిగిలిన రాతి తెలుగు లిపి శాసన భాగం ఎక్కడ ఉందో వెదికి భద్రపరచుకోవాల్సిన బాధ్యత గ్రామ సర్పంచితోపాటు గ్రామస్థులపై ఉందని ప్రముఖులు అంగత వరప్రసాద్ పేర్కొన్నారు.





