
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని కొండపై రాతియుగం నాటి రేఖా చిత్రాలు వెలుగుచూశాయి. ఇక్కడి రాళ్లపై పదునైన రాతితో గీసిన తెలుపు రంగు రాతి చిత్రాలు, మూపురపు ఎద్దులు, వృత్తంతో కూడిన త్రిశూలం, వివిధ పక్షుల ఆకృతులను బళ్లారి తాలూకా సంగనకల్లుకు చెందిన చరిత్ర పరిశోధకులు లింగన్న స్వామి వెలుగులోకి తెచ్చారు. రాతియుగం నాటి మానవులు తమ ఐక్యతకు, జీవనానికి చిహ్నంగా వీటిని గీసినట్లుగా తెలుస్తోంది,
చిన్నప్పుడు రాతి యుగం నాటి నాగరికత గురించి చరిత్ర పుస్తకాలలో అందరూ చదివే ఉంటారు. ఆ పుస్తకాల్లో ముద్రించిన చిత్రాలను పోలిన గుర్తులు పంపనూరు కొండపై కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పురావస్తు శాఖ సమగ్ర అధ్యయనం చేపట్టింది. 10 వేల సంవత్సరాల క్రితం రాతి యుగంలో ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో ఇక్కడి చిత్రాలను చూస్తే ఊహించుకోవచ్చు. కొండపైకి ఎందరో వెళ్లి వస్తున్నా… ఏనాడు రాతి యుగం నాటి రేఖా చిత్రాలను గుర్తించలేకపోయారు. ఈ కొండపై భారీ పరిమాణంలో ఉన్న రాళ్లపై దాదాపు 600కు పైగా చిత్ర లేఖనాలు ఉన్నాయి. నాటి మానవులు వేటాడే విధానం, వారి జీవన శైలికి సంబంధించిన చిత్రాలు 10 సెంటీ మీటర్ల ఎత్తు వరకూ చూడచక్కగా ఉన్నాయి. ప్రత్యేకంగా జంతువులను వేటాడటం, పక్షులు, చేతి వేలిముద్రలు, ఆయుధాల వినియోగం, వేట అనంతరం విశ్రాంతి తీసుకునే చిత్రాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి.

పదునైన రాతినే కుంచెగా మార్చి
రాతిపై చిత్రాలను గీసేందుకు అప్పట్లో పదునైన రాళ్లను వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడి కొన్ని చిత్రాల్లో పశువులను మందలుగా విభజించి, వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే విధానాలను భావితరాలకు వివరించినట్లుగా ఉన్నాయి. ప్రధానంగా వృషభాలను మచ్చిక చేసుకోవడం, వాటిని వ్యవసాయానికి, సరుకు రవాణాకు ఉపయోగించే విధానాలను కళ్లకు కట్టినట్లుగా గీశారు. వేల సంవత్సరాలు గడచినా రాతి యుగం నాటి చిత్రాలు నేటికీ చెక్కుచెదరక పోవడం గమనార్హం.
చరిత్రను కాపాడుకుందాం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆది మానవుల కాలం నాటినుంచి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి వరకూ అనేక ఆనవాళ్లు ఉన్నాయి. అయితే వాటి ప్రాముఖ్యత తెలియక చాలా మంది శిలా శాసనాలను, చిత్రాలను, కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. చరిత్ర గురించి పుస్తకాల్లోనే చదివి తెలుసుకునే అవసరం లేకుండా వాటిని నేరుగా చూసే అవకాశం పంపనూరు కొండల్లో దాగి ఉండడం విశేషం. ఇక్కడ నాటి మానవులు గీసిన చిత్రాలు అబ్బుర పరుస్తున్నాయి. వీటి ప్రాముఖ్యత తెలియక నేటి తరం వాటిపై పేర్లు చెక్కడం, చిత్రాల వాస్తవికతను దెబ్బతీసేలా గీయడం లాంటి పనులు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. పూర్వీకుల చరిత్రను భావితరాలకు చూపించే ప్రయత్నం చేద్దాం.– రజిత, ఏడీ,





