News

రాతి మండపాల సహజత్వాన్ని కాపాడండి

310views

నంద్యాల జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానందిలో పంచలింగాల రాతి మండపాల సహజత్వాన్ని కాపాడాలని ఆలయ అధికారులను దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర ఆజాద్‌ సూచించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం మహానందికి చేరుకున్నారు. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. రథసప్తమి పూజల్లో పాల్గొన్న అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. పారిశుధ్య పనులు మెరుగుపరచాలని ఆదేశించారు. దాతలు అందించిన 1000లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్‌ప్లాంట్‌ నిరూపయోగంగా ఉండటంపై ఆగ్రహిస్తూ వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అన్నదాన మండపం, అభిషేక మండపాల్లో చీలికలు వచ్చిన వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం, మహానందితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. ఆయన వెంట ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్‌ అంబటి శశిధర్‌రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్‌ దేవిక, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీశైలం శ్రీనివాసులు, మహానంది శ్రీనివాసులు, ఏఈ శ్రీనివాసులు, పడితరం ఇన్‌చార్జ్‌ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.