News

ఔషధాల సరఫరాయే లేదంటూ పాక్‌లో మెడికల్స్ బంద్

329views

పాకిస్తాన్‌లో మెడికల్ దుకాణుదారులు తమ మెడికల్స్‌ని మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. తమకు సరైన సమయంలో, సరైన విధంగా ఔషధాలను సరఫరా చేయడమే లేదని మెడికల్ దుకాణుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగానే ఇలా చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు సయ్యద్ మహ్మద్ హుస్సేన్, రషీద్ అలీ, సయ్యద్ ఇఫ్తికార్ తదితరులు ప్రకటించారు.

అయితే దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. దిగువ కుర్రం అనే ప్రాంతంలో బంకర్లను ధ్వంసం చేశారని, మొత్తం 28 బంకర్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీనితోనే ఔషధ సరఫరా సమస్యలు వస్తున్నాయన్నారు. అయితే… దీని ప్రభావం ప్రజలపై పడ్డా…. తాము మాత్రం ఆందోళన విరమించేది లేదని మెడికల్ అసోసియేషన్ అంటోంది. దీంతో ప్రభుత్వం 14 పాయింట్లతో ఓ ఒప్పందానికి రావాలని అనుకున్నట్లు సమాచారం.

చక్కెర, కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లే వాహనాల్లో ఔషధాలను చేర్చలేదని ప్రతినిధులు మండిపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా మెడికల్స్‌ని మూసివేయిస్తున్నారని కూడా ఆరోపించారు. ఔషధాల సరఫరా పునఃప్రారంభం అయ్యేవరకు మెడికల్స్‌ని తీసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.

మరోవైపు విద్యార్థులు కూడా ఆందోళనలో వున్నారు. రోడ్లన్నీ తిరిగి తెరవాలని డిమాండ్లు చేస్తున్నారు. రోడ్ల మూసివేత కారణంగా విద్యా సంస్థల అడ్మిషన్లు, ఇతర అవసరాల రీత్యా పెషావర్ తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నామన్నారు.

అంతకుముందు ఫిబ్రవరి 3న కుర్రం జిల్లాలో శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా నాలుగు బంకర్లను కూల్చివేశారు.డాన్ నివేదిక ప్రకారం, హంగూ యొక్క థాల్ ప్రాంతం నుండి ఆహార పదార్థాలను తీసుకువెళుతున్న 40 కంటే ఎక్కువ ట్రక్కుల కాన్వాయ్ వచ్చిన తరువాత వ్యాపారులు దిగువ కుర్రంలో నిరసనను నిర్వహించారు.థాల్‌-కోహట్‌ రోడ్డులో చాలా నెలలుగా వ్యాపారుల ట్రక్కులు నిలిచిపోయాయని, అయితే వాటిని కుర్రం వెళ్లేందుకు అనుమతించడం లేదని స్థానిక నేతలు అంటున్నారు.