News

కుంభమేళాని దర్శించండి… అపోహలన్నీ పటాపంచలవ్వడం ఖాయం : భయ్యాజీ జోషి

326views

భారతదేశం అర్థం కావాలంటే మహాకుంభమేళాకి రావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. మహాకుంభ్ సంగమం, సమన్వయ సందేశం ప్రపంచం మొత్తానికి చేరాలన్నారు. మహాకుంభమేళాలో జరిగిన బౌద్ధ భిక్షువుల సంగమంలో ఆయన ప్రసంగించారు. కుంభ్ మొత్తం మూడు విషయాలకు సంబంధించినదని వివరించారు. కుంభమేళాకు ఎవరు వచ్చినా పుణ్యస్నానం చేయాలనే కోరిక వుంటుందని, ఇక్కడ, గంగా యమునా సరస్వతి నదులు ఒకటిగా కలుస్తాయని, భేదం అనేది కనిపించదని, సంగమానికి ముందు ఇవి వేర్వేరు ధారలుగా వుండేవని, కానీ.. ఇక్కడ ఒకే ధారగా కలసిపోయి, ఇకపై ఈ ఏకత్వం ఇలాగే కొనసాగుతుందని చాటడమే సంగమ సందేశమని తెలిపారు.

రెండో విషయం కలయిక అని భయ్యాజీ పేర్కొంటూ… ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సాధువులు ఒకే చోట కలిసి చర్చలు, సంవాదాలు చేసుకుంటున్నారన్నారు. సాధుసంతులంతా ఒక్క చోట చేరిన సందర్భంలో.. సాధారణ ప్రజలు కూడా కలిసి మెలిసి నడుచుకోవాలన్న సందేశం వెళ్తుందన్నారు. మూడో విషయం సమన్వయం అని.. విశ్వంలో వుండాలంటే అందరితో కలిసి ముందుకు సాగాలని అన్నారు.

ఈ సందర్భంగా భయ్యాజీ ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెలియజేశారు. ఈ మొత్తం విశ్వంపై ఎవరి ప్రభావం ఉంటుందని కొందరు వ్యక్తులు చర్చ చేసినప్పుడు, ఎవరి వద్ద భౌతిక సంపద ఎక్కువగా ఉంటుందో వారే నడిపిస్తారని ఒకరు చెప్పారని, రెండో వ్యక్తి మాట్లాడుతూ ఎవరి వద్ద సంఖ్య (వనరులు) ఎక్కువగా ఉంటే వారే నేతృత్వం వహిస్తారని అన్నారని, మూడో వ్యక్తి స్పందిస్తూ ఎవరైతే అందరినీ తమతో కలుపుకుని వెళతారో వారికే విశ్వాన్ని కదిలించే శక్తి ఉంటుందని తెలిపారని వివరిస్తూ ఈ శక్తి భారత్ వద్ద ఉన్నదన్నారు.

అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారని భయ్యాజీ జోషి అన్నారు. ఆ రాజ్యాంగంలోని మొదటి పంక్తి.. మనమంతా భారత ప్రజలమని అన్నారు తప్ప… కులాలు, వర్గాల ప్రజలు అని ఆయన పేర్కొనలేదన్నారు. గ్రంథాలు, ఆరాధనా విధానాలు ఏవైనా కావొచ్చు… రాజ్యాంగం ప్రకారం భారత్ అంతా ఒక్కటే అని వివరించారన్నారు. భారత్ మాతాకీ జై అని నినదించే వారంతా ఒకే తల్లి బిడ్డలని, నేలపై విశ్వాసం, భక్తి వున్నవాడే వందేమాతరం అని నినదిస్తారని భయ్యాజీ అన్నారు.

ప్రపంచ దేశాలు భారత్‌ను అర్థం చేసుకోవాలంటే మహా కుంభమేళా వంటి పెద్ద పండగలను చూడాలన్నారు. ఒక్కసారి మహా కుంభ్‌కి వస్తే అపోహలన్నీ పటాపంచలవ్వడం ఖాయమన్నారు. విభేదాలు అని అనుకునేవారే ఇక్కడి వచ్చి చూస్తే.. అందరూ ఎంత కలివిడిగా వుంటున్నారో అర్ధమైపోతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జునా అఖాడా ఆచార్యులైన మహామండలేశ్వర్ స్వామి అవధేశానంద్ గిరి, ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఇంద్రేశ్ కుమార్, క్షేత్ర ప్రచారక్ అనిల్, ప్రాంత ప్రచారక్ రమేశ్, బౌద్ధ ప్రముఖులు పాల్గొన్నారు.