
ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఎవరికి తోచిన సేవలు వారు చేస్తూనే వున్నారు. ప్రభుత్వం, ఆరెస్సెస్ కార్యకర్తలు, జాతీయవాదులు, ఇతరులు తమకు తోచిన విధంగా సేవలు చేస్తూనే వున్నారు. ఇందులో భాగంగా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం కమ్యూనికేషన్ సేవల సౌలభ్యం కోసం బీఎస్ఎన్ఎల్ చొరవ తీసుకుంది. ఇందుకు గాను ఉచితంగా BSNL సిమ్ కార్డులను పంచిపెడుతోంది. కమ్యూనికేషన్ సువ్యవస్థితంగా నడవడానికి ఈ పద్ధతి అవలంబిస్తోంది. ఈ మేరకు సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓ కస్టమర్ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఆన్ సైట్ సహాయం, ఫిర్యాదు పరిష్కారం, ఎలాంటి అంతరాయం లేని కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఉచితంగా సిమ్ కార్డులను అందిస్తోంది.
కుంభమేళా ప్రాంతంలో ఉచితంగా సిమ్ కార్డులు అందజేస్తున్నాం. వారి వారి కుటుంబీకులతో నిత్యం కమ్యూనికేషన్ వుండేందుకు ఈ ప్రయత్నం. BSNL లాల్ రోడ్ సెక్టార్-2లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే ఈ సేవలు అందిస్తున్నాం’’ అని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటించారు. దీంతో ఫైబర్ కనెక్షన్లకు, మొబైల్ రీచార్జీ వంటి సేవలకు గణనీయంగా డిమాండ్లు పెరిగాయి.
ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన సిమ్‌కార్డులు అందుబాటులోకి రావడంతో యాత్రికులకే కాకుండా అక్కడ ఉన్న భద్రతా బలగాలకు కూడా ప్రయోజనం కలుగుతోంది.మహా కుంభ్ 2025 సమయంలో అంతరాయం లేని కమ్యూనికేషన్ సేవలను నిర్ధారించడానికి, మేళా ప్రాంతంలో మొత్తం 90 BTS టవర్లు యాక్టివేట్ చేశారు.వీటిలో 30 BTS (700 MHz 4G బ్యాండ్), 30 BTS (2100 MHz బ్యాండ్) మరియు 30 BTS (2G-ఎనేబుల్డ్) ఉన్నాయి.అదనంగా, మేళా ప్రాంతంలో ఇంటర్నెట్ లీజ్డ్ లైన్లు, Wi-Fi హాట్‌స్పాట్‌లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ (ఫైబర్-టు-ది-హోమ్), వెబ్‌కాస్టింగ్, SD-WAN, బల్క్ SMS సర్వీస్, M2M సిమ్‌లు మరియు శాటిలైట్ ఫోన్ సేవలు కూడా అందుబాటులో వున్నాయి.





