ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

45views

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం.

దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా బూదగవిలోని సూర్యదేవాలయం ఖ్యాతి గాంచింది. ఒడిశాలోని కోణార్క్‌, శ్రీకాకుళం జిల్లా అరసవెళ్లి తర్వార బూదగవిలోని ఆలయానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. 13వ శతాబ్దంలో చాళుక్కులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది. గర్భగుడిలో దక్షిణాభిముఖంగా సూర్యభగవానుడి మూలవిరాట్‌ ఉంది. ఈ అభిముఖంతో దేశంలో మరెక్కడా సూర్యభగవానుడి ఆలయాలు లేవని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మూలవిరాట్‌కు ఇరువైపులా దేవతా ప్రతిమలు ఒకే శిలలో చెక్కబడి ఉన్నాయి. అలాగే సూర్యభగవానుడి విగ్రహం ఎదుట నేలపై పరిచిన బండలపై సూర్య నమస్కారం చేస్తున్న మనిషి రూపాన్ని చెక్కారు. ఆలయం మొత్తం ఎటూ చూసిన కేవలం మూడు రాళ్లతో నిర్మించినట్లుగా గమనించవచ్చు. ఆలయంలో తూర్పు ముఖంగా అరుదైన శివలింగం నిత్య పూజలు అందుకుంటోంది. ఈ శివలింగం ఉపరితలంలో అమర్‌నాథ్‌లోని జ్యోతిర్లింగం ఆనవాళ్లు కన్పిపించడం విశేషం. రాష్ట్రంలో రెండవదిగా దక్షిణ భారతదేశంలో 3వదిగా భారతదేశంలో 8వదిగా ఈ ఆలయాన్ని పరిగణిస్తున్నారు.

‘అనంత’ అరసవల్లి… బూదగవి
మూలవిరాట్‌ పాదాలను తాకనున్న సూర్యకిరణాలు
ఏటా రథసప్తమి పర్వదినం రోజు ఆలయంలో ఉదయం సూర్యుడి కిరణాలు నేరుగా గర్భాలయంలోని మూలవిరాట్‌కు తాకుతాయి. తూర్పున ఉదయించే సూర్యుడి కిరణాలు… దక్షిణాభిముఖంగా ఉన్న సూర్యభగవానుడి మూలవిరాట్‌ను తాకే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు రాష్ట్రంలోని వివధ జిల్లాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అరుదైన ఈ ఆలయం భగవాన్‌ సత్యసాయిబాబాను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ విశిష్టతపై అప్పట్లో సత్యసాయి సమగ్ర అధ్యాయనం చేయాలని తన శిష్యులను ఆదేశించారు. ఆలయం విశిష్ఠతను పుస్తక రూపంలో తీసుకోరావాలని సత్యసాయి అప్పట్లో ప్రయత్నించినట్లు గ్రామస్తులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు.

రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
బూదగవి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభమైయ్యాయి.రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయంలో విశేష హోమాలు నిర్వహించారు. 4న రథసప్తమి సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజలు, నిర్వహించి, ఛాయ, ఉషా సమేత సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.