ArticlesNewsSeva

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

99views

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి సైతం పోటెత్తుతున్న భక్తులకు సేవలందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నడుం బిగించింది. 16వేల మంది సంఘ కార్యకర్తలు ప్రయాగరాజ్‌లో పలురకాల సేవలు అందిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు, అత్యవసర సేవలు అందిస్తున్నారు. స్వయంసేవకులు ప్రయాగరాజ్‌లోని ముఖ్యమైన కూడళ్ళ దగ్గర, రహదారుల మీద, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గరా అందుబాటులో ఉంటున్నారు. భక్తులకు ఆ ప్రాంతం గురించి తెలియజేయడానికి వారు పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు. వాహనాలను నియంత్రించడంలో, యాత్రికులకు మార్గదర్శనం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మహాకుంభమేళాలో సేవలు అందించడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎన్నో వారాల ముందునుంచీ సన్నాహాలు చేసిందని ఒక కార్యకర్త వెల్లడించారు. ప్రయాగరాజ్‌లో ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు స్వయంసేవకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందుకే వారు పోలీసులతో కలిసి పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేలా సూచనలు ఇవ్వగలుగుతున్నారు.

‘‘కోట్లాది భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్‌ నియంత్రణే కీలకమైన సవాలు. ఆ విషయంలో సంఘ్ కార్యకర్తలు ప్రధానమైన భూమిక పోషిస్తున్నారు. ఇక్కడ భక్తుల కదలికలను క్రమబద్ధీకరించడం ద్వారా రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని మరో సంఘ కార్యకర్త చెప్పారు.

ట్రాఫిక్ నియంత్రణతో పాటు సంఘ కార్యకర్తలు ప్రయాగరాజ్‌లో పరిశుభ్రత, వైద్యసేవలు, ఇతర అత్యవసర సేవలు అందిస్తున్నారు. మహాకుంభమేళా అనేది జాతీయ పర్వం. దాన్ని విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని సంఘ్ భావిస్తోంది.

ప్రయాగరాజ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు తగిన వసతి కల్పించడానికి అధికార యంత్రాంగం, ఆర్ఎస్ఎస్, అలహాబాద్ యూనివర్సిటీ కలిసి విశ్వవిద్యాలయం ఆవరణలో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసాయి. భక్తుల కోసం విశ్వవిద్యాలయం తమ గేట్లు తెరిచి ఉంచింది. వర్సిటీ క్యాంపస్‌లో టెంట్లతో శిబిరాలు ఏర్పాటు చేసారు. షెల్టర్ కావలసిన ప్రయాణికులు యూనివర్సిటీ గేట్ నెంబర్ 1 దగ్గరకు వెడితే అక్కడుండే సంఘ కార్యకర్తలు వారికి సహాయం చేస్తారు.

మౌని అమావాస్య రోజు దురదృష్టకరమైన సంఘటనతో సంఘ కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరిచారు. బృందాలుగా ఏర్పడి ట్రాఫిక్ నిర్వహణ, గుంపుల నియంత్రణ, భక్తుల భద్రత వంటి విషయాల్లో అధికార యంత్రాంగానికి సాయపడుతున్నారు.

ఇంక ప్రయాగరాజ్‌లోని వివిధ ప్రదేశాల్లో సంఘ కార్యకర్తలు భోజన ఏర్పాట్లు కూడా చేసారు. భక్తులకు ఆహారం అందజేస్తున్నారు. సెక్టార్ 9లోని కలశ ద్వారం, సెక్టార్ 7లోని సూర్య ద్వారం దగ్గర సంఘ కార్యకర్తలు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. బేలా కచ్చర్, ఫఫామావు, శ్యామాప్రసాద్ ముఖర్జీ నగర్ వద్ద సంఘ శాఖలు భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి వేళల్లో భోజనం అందిస్తున్నారు.

దారాగంజ్‌లోని రజ్జూభయ్యా నగర్, సుబేదార్‌గంజ్‌ దగ్గర సంఘ కార్యకర్తలు ఆహారం ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. అలాగే టీ-బిస్కెట్లు పంచుతున్నారు. ప్రయాగరాజ్‌కు చేరువలోని ప్రతాప్‌గఢ్, సుల్తాన్‌పూర్, వారణాసి, మీర్జాపూర్‌ వంటి జిల్లాల్లో చిక్కుకున్న భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఆర్ఎస్ఎస్ కాశీ ఖండ ప్రచార ప్రముఖ్ డాక్టర్ మురార్జీ త్రిపాఠీ వెల్లడించారు.

కుంభమేళా సందర్భంగా ఎలాంటి అనవసర భయాందోళనలూ పెట్టుకోవద్దనీ, ప్రశాంతంగా ఉండాలనీ దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజ్ఞప్తి చేసింది. ‘‘మేం పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఎవరికీ ఆందోళన అక్కర్లేదు. ప్రశాంత మనస్సుతో భక్తిభావంతో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలూ అందజేస్తాం’’ అని సంఘం ప్రతినిధులు వెల్లడించారు.

అధికార యంత్రాంగం, పోలీసులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల సమష్ఠి ప్రయత్నాలతో ప్రయాగరాజ్ మహాకుంభమేళా ఎంతో వ్యవస్థీకృతంగా సాగుతోంది. కోట్లాది భక్తులకు సురక్షితమైన పుణ్యక్షేత్ర సందర్శన, యాత్ర అనుభూతిని అందజేస్తోంది.