
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్ గారు థానేలోని భివండిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం మార్గం చూపుతుందని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అటువంటి భారతదేశాన్ని సృష్టించడం దేశ ప్రజల సహజ బాధ్యత అని అన్నారు.
ఆరాధన కూడా ధర్మంలో భాగమే:
ఆరాధన అనేది ధర్మంలో భాగమని, ఆహారం, ఆచార వ్యవహారాలకు కూడా నిబంధనలు ఉన్నాయని అయితే అవి ధర్మాచరణలో భాగం మాత్రమే అని మోహన్ భాగవత్ గారు అన్నారు. ఇవి దేశ కాల మాన పరిస్థితులను అనుసరించి మారుతుంటాయని మరియు మారాలని ఆయన స్పష్టం చేశారు. అయితే ధర్మం యొక్క శాశ్వత అంశం ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా, పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని సమర్పిస్తూ సౌభ్రాతృత్వమే ధర్మమనే విషయాన్ని డాక్టర్ బిఆర్. అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రపంచంలోని ఆధ్యాత్మికత ఆరాధన మరియు ఆహారంలో చిక్కుకుందని అయితే ఆధ్యాత్మికత విషయంలో భారత్ మొదటి నుంచి ముందంజలో ఉందని దాన్ని మన ప్రత్యక్ష జీవనంలో అనుసరించి చూపించాలని సర్‌సంఘ్‌చాలక్ గారు అన్నారు. ధర్మం, కర్మ, అర్థ మరియు మోక్షం అనే నాలుగు పురుషార్థాలను ఆచరణలో పెట్టి మన జీవన ఉదాహరణ ద్వారా ప్రపంచానికి చూపించాలన్నారు. రాబోయే తరం మనల్ని అధిగమించడమే కాక భారత్‌ను మరింత ఉన్నతంగా సాక్షాత్కరింపజేయాలనే ఆశయం నేటి తరం భుజాలపై ఉందన్నారు.
జాతీయ జెండా మధ్యలో ధర్మ చక్రం:
ఎవరైతే తమ కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారో వారి పట్ల ప్రజలకు గౌరవం పెరుగుతుందని, గ్రామానికి సేవ చేసే కుటుంబం పట్ల గౌరవ మర్యాదలు ఏర్పడతాయని సర్‌సంఘ్‌చాలక్ గారు అన్నారు. ఏ గ్రామం నుంచైతే ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తులు దేశం కోసం ముందుకు వస్తారో ఆ గ్రామానికి ఖ్యాతి లభిస్తుందన్నారు. మన జాతీయ జెండా మధ్యలో ధర్మ చక్రం ఉందని అది సోదరభావం, సామరస్యం, సమానత్వం, స్వతంత్రత సందేశాన్ని అందిస్తోందన్నారు.





