
( జనవరి 26 – రాణి గైడిన్లియు జయంతి )
భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి రాణీ మా గైడిన్లియు . ఆదివాసీల జీవనవిధానాన్ని కాపాడటానికి బ్రిటిషర్ల ఆయుధాలకు ధైర్యంగా ఎదురు నిలిచిన ధీర వనిత. నాగజాతిలోని రోంగ్మెయి తెగకు చెందిన రాణిమా దేశం గర్వించదగ్గ గొప్పపోరాట యోధురాలు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన పోరాటపటిమ, ధైర్యసాహసాలు త్యాగం అసమానం. గైడిన్లియు 1915 జనవరి 26వ తేదీన ప్రస్తుత మణిపూర్ రాష్ట్రంలోని తమెన్‌గ్లాంగ్ జిల్లాలోని “నుంగ్కావు”లో జన్మించారు.
నాగ జాతి నాయకుడు హైసావు జుడోనాంగో బోధనలు గైడిన్లియును ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన హెరాకా మత ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమ ఆశయం నాగజాతి పునరుజ్జీవనం, బ్రిటిష్ వారి పరిపాలనను అంతం చేయడం. 1931లో జుడోనాంగో మరణించడంతో ఆయన వారసురాలిగా గైడిన్లియు బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి ఆమె వయసు నిండా 15 ఏళ్లు మాత్రమే. ఆమె తన వర్గాలను కూడదీసి బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పన్నులు చెల్లించకుండా దేశ స్వాతంత్ర్యానికి పోరాడింది. రాణి గైడిన్లియు మాట మీద అన్ని నాగా వర్గాలు బ్రిటిష్ పాలకులను ఎదిరించి సహాయనిరాకరణ పాటించారు. ఈశాన్యంలో పెరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం రాణి గైడిన్లియుని 1932 అక్టోబరు 17న నిర్బంధించింది. ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. అలా అతి చిన్న వయసులో అంటే తన 16వ ఏట జైలు పాలై, దాదాపు పదిహేనేళ్లు జైలు జీవితం గడిపి స్వాతంత్ర్యం తరువాత రాణి గైడిన్లియు విడుదల అయ్యారు.
స్వాతంత్ర్యానంతరం నాగా వర్గాలను ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు, నాగా సంప్రదాయమైన హెరాకా మతాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేశారు. దీన్ని నాగా నేషనల్ కౌన్సిల్ భరించలేకపోయింది. అప్పటికే మత మార్పిడుల వల్ల బలపడిన “నాగా చర్చ్” నాగా సాంప్రదాయ పునరుద్ధరణను ఖండిస్తూ రాణి గైడిన్లియు కార్యకలాపాలు క్రైస్తవానికి వ్యతిరేకమని ప్రచారం చేయడం ప్రారంభించింది. దీంతో వేర్పాటువాడ నాగా నేషనల్ కౌన్సిల్‌తో పోరాడుతూ 1960 నుంచి 1966 మధ్య కాలంలో అజ్ఞాత జీవితం గడిపారు. తమ సంప్రదాయక సంస్కృతి, మత రక్షణకు ‘రాణి పార్టీ జేలియనగ్రాంగ్ ప్రభుత్వాన్ని’ నడిపారు. రాణి గైడిన్లియు భారత జాతీయవాది అని స్పష్టం కావడంతో అటు ఇందిరా గాంధీ ప్రభుత్వం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెను అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి తమ ప్రభుత్వంలో చేరమని ఆహ్వానించాయి. ఆమె చివరికి 1966 జనవరి నెలలో బయటకు వచ్చి, తన సైన్యాన్ని నాగాలాండ్ పోలీస్‌లో భాగం చేశారు. అనంతరం 1966 నుంచి 1992 వరకు ఆమె నాగాలాండ్ రాజధాని కొహిమాలో నివసించారు.
రాణి గైడిన్లియు ఎల్లప్పుడూ ఇతర జాతీయ సంస్థలైన వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం, విశ్వహిందూ పరిషత్, విద్యాభారతి సంస్థలతో అనుబంధంగా పని చేశారు. 1969లో జరిగిన హిందూ సదస్సులో ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ ఎంఎస్. గోల్వాల్కర్‌ను కలుసుకున్నారు. రాణి గైడిన్లియు దేశమంతా పర్యటించి నాగాలు వేర్పాటువాదులు కాదని వారిలో అధిక శాతం హిందువులేనని, భారతదేశంలోనే జీవించాలని కోరకుంటున్నారని ప్రజలకు తెలియజేశారు. నాగాలను భారతజాతి ప్రధాన స్రవంతిలో కలిపేందుకు ఆమె చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 1972లో తామ్రపత్రంతో, 1981లో పద్మభూషణ్‌తో సత్కరించింది. రాణి మా గైడిన్లియు 1983లో వివేకానంద సేవా అవార్డును అందుకున్నారు. మరణానంతరం 1996లో ‘బిర్సాముండ పురస్కారం’ వీరిని వరించింది. రాణి గైడిన్లియు పేరుతో తీర రక్షణ నౌకను విశాఖపట్నంలోని నేషనల్ కోస్ట్ గార్డ్ ఏర్పాటు చేసింది.
వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా రాణి గైడిన్లియు తన స్వంత గ్రామంలో 1993 ఫిబ్రవరి తుదిశ్వాస వదిలారు. అతి పిన్న వయసులోనే ఉద్యమ నేతగా మారిన ఒక స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సుధీర్ఘ కాలం జీవితఖైదీగా జైలులో మగ్గి, చిత్రహింసలను అనుభవించిన గొప్ప మహిళగా, కొండప్రాంతాల గెరిల్లా దళాలను పోరాట పథంలో నడిపిన గిరిజనోద్యమ నాయకురాలిగా రాణి మా గైడిన్లియు ఆదివాసీ సమాజానికే కాదు భారతీయులందరికీ చిరస్మరణీయురాలు.





