
శ్రీశైలంలో త్వరలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులను అతిథిగా భావించి సేవలందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన అన్నప్రసాద వితరణ భవనంలో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాథ్, అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, శ్రీశైలం సబ్ డీఎఫ్‌వో మహమ్మద్ అన్సర్ అలీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముందుగా శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు గతేడాది జరిగిన ఉత్సవాల నిర్వహణ, బ్రహ్మోత్సవ క్రతువులు, పట్టువస్త్రాలు, ప్రస్తుతం చేపట్టిన పనులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. అవసరమైన ప్రతిపాదనలను సమర్పిస్తే దేవస్థానం ఈఓని సమన్వయం చేసి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, రవాణా, భక్తులకు స్వామివారి అలంకార దర్శనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించాలన్నారు. మన ఇంటికి వచ్చిన వారిని ఎంత అత్మీయంగా పలకరించి, మర్యా దలు చేస్తామో, శివరాత్రికి వచ్చిన భక్తులను కూడా అదేవిధంగా సేవలందించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళా నిర్వహణను ఆదర్శంగా తీసుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
శాఖల వారీగా సమీక్ష ఇలా..
● బ్రహ్మోత్సవాల 11రోజుల్లో సాక్షిగణపతి ఆలయం వద్ద వాహనాలకు టోల్ వసూలు చేయకూడదని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
● ఘాట్‌రోడ్డులో కాన్వెక్స్ మిర్రర్లను ఏర్పాటు చేయాలని, ఘాట్‌రోడ్డులో ప్యాచ్ వర్క్, రోడ్డుకు ఇరువైపులా బరమ్స్, రక్షణగోడలు నిర్మించాలని ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.
● పాతాళగంగలో, క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పాతాళగంగ వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
● గతంలో నడిపిన బస్సు సర్వీసుల కంటే అదనంగా ఈ ఏడాది వాహనాలను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
● భీమునికొలను, కై లాసద్వారం ప్రాంతాలలో, కాలినడకవచ్చే భక్తులు ప్రమాదానికి గురైతే బాధితులకు స్ట్రెచ్చర్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. పటిష్ట ప్రణాళికలతో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలన్నారు.
●వివిధ సెక్టార్లలోని ఉద్యోగులకు క్యూర్‌కోడ్ ఐడెంటి కార్డులను అందించాలన్నారు.





