News

కుంభమేళా.. మనకూ ఆదర్శమే

353views

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగరాజ్‌ కుంభమేళా పరిశీలనకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు చెందిన అధికార బృందం తరలివెళ్లనుంది. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో కుంభమేళాను అధ్యయనం చేయడం ద్వారా ఏర్పాట్లపై మరింత అవగాహన ఏర్పడుతుందని యంత్రాంగం భావిస్తోంది. ఇందుకుగాను ఎంపిక చేసిన వివిధ శాఖల అధికారులు వెళ్లనున్నట్లు కమిషనర్‌ కేతన్‌ గర్గ్‌ తెలిపారు.

అదే తరహాలో ఏర్పాట్లు..
వాస్తవానికి గత గోదావరి పుష్కరాలకు ముందు ఇదే తరహాలో కుంభమేళా జరిగింది. దాని మాదిరిగానే కొన్ని ఏర్పాట్లు ఇక్కడా చేపట్టారు. ప్రధానంగా భక్తుల రద్దీ, పుణ్యస్నానాల కోసం వచ్చేవారికి ఎటువంటి సౌకర్యాలు అవసరమో ఒక అంచనాకు రాగలిగారు. అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో పుష్కరాలపై విస్తృత ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో లక్షలాది భక్తులకు అనుగుణంగా ముందస్తుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఓ అవగాహన ఏర్పడింది. గంగానది కుంభమేళాలో వారణాసికి ఎక్కువగా తరలి వచ్చే భక్తులు, అందుకు అనుగుణంగా ఘాట్లు, నదిలో రక్షణ వలయం ఏర్పటు ఇవన్నీ మాదిరిగా తీసుకొని రాజమహేంద్రవరం నగరంలో ఘాట్లను మార్పులు చేశారు. ఇక్కడకు వచ్చే భక్తుల మార్గాలను వేరు చేయడం ద్వారా రద్దీని నియంత్రించగలిగారు. అయితే గంగానదిపై తాత్కాలికంగా వంతెలను ఏర్పాటు చేయగా, ఇక్కడ కూడా ఆ ప్రయోగం చేయాలనుకున్నా సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. పుష్కరఘాట్‌ను పొడిగించడం, కొత్తగా కోటిలింగాల రేవును 1.2 కి.మీ మేర నిర్మాణం చేపట్టడంతోపాటు అదనంగా నాడు సరస్వతి ఘాట్‌ ఏర్పాటుచేశారు.

రెట్టింపు సంఖ్యలో వచ్చే అవకాశం
ఈ సారి పుష్కరాలకు అఖండ గోదావరి కలిగిన రాజమహేంద్రవరం వచ్చే భక్తుల సంఖ్య పెరగనుంది. గతంతో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కర ఏర్పాట్ల్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ముందస్తుగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రానున్న రెండేళ్లలోపు శాశ్వత ప్రాతిపదికన, పర్యాటక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కుంభమేళాలో అక్కడ యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పరిశీలనకు బృందం వెళ్లనుంది. వీటిలో పారిశుద్ధ్య నిర్వహణ, భక్తులకు బస, రద్దీ నియంత్రణ, స్నానాలకు సమయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రయాణ సౌకర్యాలు పరిశీలిస్తారు. అనంతరం నివేదిక అందించనున్నారు.