
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, యోగా జీవన విధానమే మేలని పలువురు విదేశీయులు చెబుతున్నారు. తాటిచెట్లపాలెంలోని మాస్టర్ ఇ.కె.సంస్కృతి సదన్‌లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, పరిశీలన కోసం వచ్చిన ఐరోపా ఖండానికి చెందిన పలు దేశస్థులు మంగళవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఆకర్షితుడినయ్యా..

కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు 24 పర్యాయాలు ది వరల్డ్ టీచర్ ట్రస్ట్(జగద్గురు పీఠం) నిర్వహిస్తున్న గురు పూజోత్సవంలో పాల్గొన్నా. శాంతియుత వాతావరణం, కులమతాలకతీతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు నన్ను ఆకర్షించాయి. మాస్టర్ ఎక్కిరాల రామకృష్ణ(ఇ.కె.) రచించిన ‘ఓవర్‌సీస్ మెసెజెస్’, ‘యోగా ఆఫ్ పతంజలి’, ‘ది మంత్ర స్క్రిప్చర్’(భగవద్గీత) వంటి ఆంగ్ల గ్రంథాలు మా సాధనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
– లుడ్జర్ ఫిలిప్స్(స్విట్జర్లాండ్)
ఎన్నో విషయాలు నేర్చుకున్నా..

భారతీయ జీవన శైలి, సంప్రదాయం, ప్రాచీన విజ్ఞానంలో ఉన్న సత్యపరమైన, ఆయుర్వేద విషయాలను నేర్చుకున్నాను. పీఠం ప్రతినిధి మాస్టర్ పార్వతీకుమార్ విదేశాల్లో చేసిన ప్రసంగాలు నన్ను సంస్కరించాయి. ఆయన రచించిన ‘టీచింగ్స్ ఆఫ్ సనత్‌కుమారా’ ‘శంబల’ ఆంగ్ల పుస్తకాలు నాలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని, ఆనందాన్ని కలిగిస్తుంటాయి. యోగాలో ప్రసిద్ధిగాంచిన ‘అకల్ హీలింగ్’ అనే పుస్తకాన్ని స్పానిష్ భాషలోకి అనువదించాను. ఇప్పటివరకు 26 సార్లు భారత్‌ను సందర్శించాను.
– డాక్టర్ డోనా, ఆయుర్వేద వైద్యురాలు(స్పెయిన్)
భారత్ సందర్శించడం ఆనందంగా ఉంది..

ఆధునిక యుగంలో స్వధర్మాన్ని ఆచరించడంతో పాటు ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి పతంజలి యోగం, సమన్వయాత్మక దృక్పథం దోహదపడతాయి. భారతీయ సంప్రదాయ గ్రంథాలలో ఉన్న తత్వ, జ్ఞాన సంపద ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగకరం. మాస్టర్ ఇ.కె. సంస్థల ఆధ్వర్యంలో భారత్‌లో నడుస్తున్న సేవా సంస్థలు, పాఠశాలలు, వైద్య, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలను సందర్శించడం ఆనందంగా ఉంది.
– మైఖేల్, ఫెడరిక్ దంపతులు, స్పెయిన్, ఫ్రాన్స్





