News

భారత్, యూఎస్‌ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర.. కేంద్రానికి నివేదిక

52views

భారత్‌, అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్న విషయాన్ని అత్యున్నత స్థాయి అధికారుల విచారణ కమిటీ గుర్తించింది. దర్యాప్తులో తెలిసిన అంశాలతో రూపొందించిన తుది నివేదికను తాజాగా భారత ప్రభుత్వానికి అందజేసింది. 2023 నవంబరులో ఏర్పాటైన ఈ కమిటీ విచారణకు అవసరమైన కీలక సమాచారాన్ని అమెరికా అధికారులు భారత్‌తో పంచుకున్నారు. కొన్ని వ్యవస్థీకృత నేర బృందాలు, ఉగ్రవాద సంస్థలు, మాదక ద్రవ్యాల ముఠాలు తదితరులు చేస్తున్న కార్యకలాపాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చున్నారు.

ఈ సమాచారం ఆధారంగా భారత్‌లో ఏర్పాటైన విచారణ కమిటీ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టింది. యూఎస్‌ అధికారులు ఇచ్చిన లీడ్‌లు తీసుకొని కూపీ లాగింది. భారత్‌లోని పలు విచారణ సంస్థల్లో పని చేస్తున్న అధికారుల నుంచి కూడా విచారణ కమిటీ కీలక సమాచారం రాబట్టింది. పలు కేసులకు సంబంధించిన దస్త్రాలను నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో యూఎస్‌ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. భారత్‌, అమెరికా అధికారులు పలు మార్లు ఇరు దేశాల్లో పర్యటించి తెలిసిన సమాచారాన్ని పంచుకున్నారు.

సుదీర్ఘ విచారణ అనంతరం అత్యున్నత స్థాయి అధికారుల విచారణ కమిటీ తమ నివేదికను భారత ప్రభుత్వానికి అందజేసింది. దేశ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ చేపడుతున్న క్రమంలో ఆ వ్యక్తి నేర సంబంధాలు, పూర్వాపరాలు బయటపడ్డాయని వెల్లడించింది. కావున వీలైనంత త్వరగా చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరింది. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రభుత్వ పరంగా కొన్ని విధానాలను మెరుగు పరచుకోవాల్సి ఉందని విచారణ కమిటీ సిఫారసు చేసింది. కొన్ని మార్పులు చేస్తే ఇలాంటి నేరాలపై భారత ప్రతిస్పందన సామర్థ్యం బలోపేతమవుతుందని వ్యాఖ్యానించింది.