
ఒకవైపు ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం ఎంతకూ తెగడం లేదు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆయా దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నడుమ.. 2025కు సంబంధించి దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాల సందర్భంగా తన వార్షిక ‘అంతర్జాతీయ నష్ట ప్రమాద నివేదిక’ను విడుదల చేసింది. 900 మంది నిపుణులు, విధానకర్తలు, పరిశ్రమాధిపతులను సర్వే చేసి దీన్ని రూపొందించింది. మొత్తం మీద వాతావరణ సంక్షోభాలను తక్షణ, స్వల్ప, దీర్ఘకాలిక ముప్పుగా పరిగణించింది.
దేశాల మధ్య సాయుధ ఘర్షణలు, విపత్కర వాతావరణ పరిస్థితులు, భౌగోళిక-వాణిజ్య వివాదాలు, తప్పుడు సమాచార వ్యాప్తి, సామాజిక విభజనలను ఈ ఏడాదికి సంబంధించి మొదటి ఐదు తీవ్ర ముప్పులుగా పేర్కొంది.
వచ్చే రెండేళ్లలో తప్పుడు సమాచార వ్యాప్తిని అతిపెద్ద ముప్పుగా తేల్చింది. దీంతోపాటు ప్రకృతి ప్రకోపాలు, దేశాల సాయుధ ఘర్షణలు, సామాజిక విభజనలు, సైబర్ గూఢచర్యాలను స్వల్పకాలిక ముప్పులుగా వర్గీకరించింది.
వచ్చే పదేళ్లలో వాతావరణ వైపరీత్యాలను తీవ్ర ముప్పుగా పరిగణించింది. జీవవైవిధ్య నష్టం-పర్యావరణ వ్యవస్థ పతనం, భూమి ఆవరణ వ్యవస్థల్లో మార్పులు, ప్రకృతి వనరుల కొరత, తప్పుడు సమాచార వ్యాప్తిని దీర్ఘకాలిక ముప్పులుగా పేర్కొంది.
భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ శక్తులుగా..
రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచ రాజకీయాల దృక్పథం విషయానికొస్తే.. చాలా మంది నేతలు బహుళ ధ్రువ, వికేంద్రీకరణ పరిస్థితులను ఆశిస్తున్నట్లు నివేదిక తెలిపింది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో క్షీణత కొనసాగుతుందని.. చైనా, భారత్, గల్ఫ్ దేశాల రూపంలో ప్రత్యామ్నాయ శక్తులు బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం, వాతావరణ సంక్షోభాల వంటివి ప్రపంచానికి సవాళ్లుగా మారాయని డబ్ల్యూఈఎఫ్ ఎండీ మిరెక్ డుసెక్ తెలిపారు. పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడమా? లేదా సంక్లిష్టతలను ఎదుర్కోవడమా? అనేది నేతల చేతుల్లోనే ఉందన్నారు.