News

పాక్‌తో అంటకాగుతున్న బంగ్లా.. వీసా ప్రక్రియ మరింత సులువు

227views

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌హసీనా పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందడం.. ఆ దేశంలోని హిందువులు, మైనారిటీలపై దాడి నేపథ్యంలో భారత్‌-బంగ్లా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌ అనుకూలంగా పలు చర్యలు తీసుకుంటోంది. ఆ దేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్‌ ప్రభుత్వం సులభతరం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

పాకిస్థాన్‌ రాయబారులు, ఉన్నతాధికారులకు వీసాలు జారీ చేసే సమయంలో ఢాకా నుంచి క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటిని తొలగిస్తున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినట్లు పాకిస్థాన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ ఇక్బాల్ హుస్సేన్ లాహోర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యాపార వర్గాలకు వెల్లడించారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆసక్తి చూపుతోందని హుస్సేన్ అన్నారు. ఇందులో భాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరస్పర వాణిజ్యం, సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ఇరు దేశాల బాధ్యత అని అన్నారు.

180 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ పాకిస్థాన్‌కు ముఖ్యమైన వాణిజ్య మార్కెట్‌గా మారుతుందని హుస్సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని పాక్‌ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ సహకారం పెరుగుతున్నప్పటికీ, దక్షిణాసియా ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటోందని.. వీటిని అధిగమించడానికి సమష్టి కృషి అవసరమని అన్నారు. ప్రాంతీయ వాణిజ్యం, సహకారాన్ని పెంపొందించడానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.

షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక సారథి నేతృత్వంలోని బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. దానిలో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్‌ నుంచి నేరుగా బంగ్లాకు కార్గో షిప్‌, సరకు రవాణా నౌకలు చేరుకున్నాయి. హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్థాన్‌ నుంచి వచ్చే కార్గోను భౌతికంగా తనిఖీ చేయాలనే నిబంధన ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం దానిని తొలగించింది. దాంతో కార్గో తరలింపు పాక్‌ నౌకలకు సులభం కానుంది. అయితే సరకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు అందొచ్చని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.