
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని ‘కుంభమేళా’ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని ‘అర్ధ కుంభమేళా’ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ‘మాఘీమేళా’ అనే పేరుతో పిలుస్తారు. బాండమును ‘కుంభం’ అని ‘కలశం’ అని అంటారని మనకు తెలుసు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించినవిధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది.
ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగ ఆకాశమార్గం గుండా వచ్చి హిమాలయాలపైన చేరి.. అక్కడి నుండి శివుడి జటాజూటంలో పడి హరిద్వార్ వద్ద దివి నుంచి భువికి దిగివచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగరాజ్ వద్ద గంగా యమునా అంతర్వాహిని సర్వసతి నదిని కలుపుకొని.. త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో మహాకుంభమేళా జరగబోతున్నది.
కుంభమేళాలో..
కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుంచి అనేకానేక వేడుకలు జరుగుతాయి. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత, మునుల చేత, సన్యాసుల చేత నెలల తరబడిగా ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త కొత్త విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. సమాజానికి పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అది.
ధర్మరక్షణ కోసం..
కుంభమేళా సమయంలో అనేక ఏనుగులు, గుర్రాలు, రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయక ఊరేగింపు సమయంలో నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు, కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు.
అనంతరం ‘షాహిస్నాన్’ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ, ‘ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు’. పూజ్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు. కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు.
సామాజిక సమరసత వెల్లివిరిసే చోటు
పుణ్య స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల భేదాలు మరిచిపోయి, కులాలు మరిచిపోయి, ఆరాధనా పద్ధతులు ఏవైనా తరతమ భేదాలు పాటించకుండా కుంభమేళా సమయంలో కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం, మంచినీళ్లు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, రాత్రివేళల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తమతమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం, వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేస్తుంటారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం
చంద్రమండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనబడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళా. ప్రపంచంలోనే అతి పెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళా. ప్రపంచంలోని 13వ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం. సగం దేశాల జనాభా కంటే ఎక్కువ. 2017 వ సంవత్సరం అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా, 2001వ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
ఈ సంవత్సరం కనీసం 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రాచీన కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్ సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 సంవత్సరంలో బెంగాల్ కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా, తులసీ రామాయణాన్ని రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెబుతున్నది.
– ఆకారపు కేశవరాజు,విశ్వహిందూ పరిషత్,కేరళ, తమిళనాడు రాష్ట్రాల సంఘటన మంత్రి





