
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బటోత్ ప్రాంతంలో జమ్మూ-కిష్టావర్ జాతీయ రహదారిపై వస్తున్న పౌర వాహనాన్ని ఇద్దరు అనుమానితులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని ఉగ్రవాదులుగా అనుమానించిన డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. సమీపంలోని సైనిక స్థావరానికి సమాచారమిచ్చాడు. దీంతో వెంటనే సైనికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భదత్రా సిబ్బందిని గుర్తించిన ముష్కరులు తొలుత గ్రనేడ్ విసిరారు. అనంతరం కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఉదయం నుంచి ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తుండగా.. ఇంట్లో నక్కిన వారు మధ్యాహ్నం మరోసారి కాల్పులు జరిపారు. వీటిని భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారత్‌లోకి చొరబడేందుకు సరిహద్దుల్లో ముష్కరులు వేచిచూస్తున్నారని.. భీకర దాడులకు కుట్ర పన్నుతున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తాజా ఘటన ప్రాధాన్యం సంతరించుకొంది.
గాందర్‌బల్‌లో ఉగ్రవాది హతం..
మరోవైపు గాందర్‌బల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు ప్రారంభించగా.. జవాన్లు తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.





