News

ధ్వంసమైన విగ్రహం – హిందూ సంస్థల ఆగ్రహం

704views

రోజు రోజుకీ ఎక్కడ ఏ ఘోరం జరుగుతుందో, ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్ధం కాకుండా వుంది.

ఇప్పుడు తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరంలో నవరాత్రి ఉత్సవాల కోసం సిద్ధం చేసిన దుర్గా మాత విగ్రహాలను కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చెయ్యడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ సంఘటన అర్దరాత్రి సమయంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం సర్పవరంలో మూర్తి అనే వ్యక్తి ప్రతి ఏడాదీ దుర్గా నవరాత్రి ఉత్సవాలలోనూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలలోనూ మండపాలలో ఆ తొమ్మిది రోజుల పాటూ భక్తులు కొలిచే తాత్కాలిక విగ్రహాలను తయారు చేయిస్తుంటాడు.

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విగ్రహాలను తయారు చేయించాడు. అనేక ఆర్డర్లు కూడా వచ్చాయి. అందరి దగ్గరా అడ్వాన్సులు తీసుకుని ఉత్సవాల సమయానికి అందిస్తానని మాటిచ్చాడు మూర్తి. అనుకన్నట్టే, అనుకున్న సమయానికి విగ్రహాల తయారీ కూడా పూర్తయింది.

రెండు మూడు రోజుల్లో డెలివరీ ఇచ్చేస్తామనగా ఇప్పుడు ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. షుమారు 120 విగ్రహాల వరకూ ధ్వంసమయ్యాయని యజమాని మూర్తి చెబుతుండగా, కొన్ని వార్తా చానళ్ళలో మాత్రం 20 విగ్రహాలని వార్తలొస్తున్నాయి.

దీనికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలో, కష్టమర్లకు యేమని సమాధానం చెప్పాలో అంటూ విలపిస్తున్నారు తయారీదారులు.

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.