
భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని యత్నించిన పాకిస్థానీ ఉగ్రవాదులను మన సైన్యం తరిమి తరిమి కొట్టింది. రాళ్ల గుట్టల చాటుగా నక్కి నక్కి వస్తున్న ముష్కరులను పసిగట్టి బులెట్ల వర్షం కురిపించింది. దీంతో ఆ ఉగ్రవాదులు తోకముడిచారు. బతుకు జీవుడా అనుకుంటూ వారు తమ భూభాగంలోకి పరుగులు పెట్టారు.
జమ్ముకశ్మీర్‌లోని ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కొద్ది రోజుల ముందు జులై 30వ తేదీన నలుగురు ఉగ్రవాదులు కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. అయితే వీరిని గుర్తించిన ఫార్వర్డ్ పోస్ట్ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. తూటాల వర్షానికి జడిసిన ఓ ఉగ్రవాది భయంతో వెనక్కి పరుగులు పెట్టగా.. అది చూసిన మిగతా ముగ్గురు కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ తాజాగా విడుదల చేసింది.
భారత సైన్యం గతంలోనూ ఇలాంటి వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన సరిహద్దు కార్యదళం(బ్యాట్) దేశంలోకి చొరబడేందుకు యత్నించగా.. భారత జవాన్లు వారిని హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సెప్టెంబరు 9న ఆర్మీ విడుదల చేసింది.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో పాక్ విపరీత చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులను దేశంలోకి పంపి విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతోంది. దీంతో నియంత్రణ రేఖ సహా దేశ సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది.





