News

దేవాలయ వ్యవహారాలలో అన్య మతస్థుల జోక్యం కూడదు – హై కోర్టు.

1.42Kviews

మధ్య శ్రీశైలంలో క్రొత్తగా నిర్మించిన ‘లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్’లోని షాపుల కేటాయింపు కోసం దేవస్థానం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో కొందరు ముస్లిములు కూడా వేలంలో పాల్గొనడం కోసం దరఖాస్తు చేసుకోవడం, దానిపై వివాదం రేగడం, రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశైల మల్లిఖార్జునుని భక్తుల ఆగ్రహంతో దిగివచ్చిన ప్రభుత్వం శ్రీశైల దేవస్థాన ఈవో శ్రీరామచంద్రమూర్తిని బదిలీ చెయ్యడం పాఠకులకు విదితమే.

ఆ సందర్భంగా హైందవేతరులెవ్వరూ దేవాలయానికి చెందిన స్థిరాస్తుల నిర్వహణ, లీజుకు స్వీకరించడం వంటివి చెయ్యరాదని దేవాలయ అధికారులు ఒక నిబంధన తెచ్చారు.

వేలం ద్వారా షాపులు దక్కించుకోజూసిన కొందరు ముస్లిం వ్యాపారులు ఈ నిబంధనను సవాలు చేస్తూ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలను వినిపించారు.

ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం దేవాదాయ ధర్మాదాయ చట్టాలు, నిబంధనల ప్రకారం దేవాలయాలకు చెందిన స్థిరాస్తులను అన్య మతస్థులెవరూ లీజుకు తీసుకోవడం గానీ, నిర్వహించడం గానీ, స్థిరాస్తులలో నిర్వహించే సంస్థలలో ఉద్యోగాలు పొందడం గానీ, దేవాలయ పరిసరాలలో ఎటువంటి వ్యాపారాలూ నిర్వహించడానికి గానీ అనుమతి లేదని సుస్పష్టమైన తీర్పు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఈ తీర్పుతో భక్తులలో, హిందూ వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది. కేసు నడుస్తున్న విషయం తెలుసుకుని ప్రభుత్వ న్యాయవాదికి స్వచ్చందంగా తమ సహకారాన్నందించిన శ్రీశైలానికి చెందిన స్థానిక న్యాయవాది శ్రీ శ్రీనివాసమూర్తి, విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ రఘునందన్ రావులను అనేక హిందూ సంస్థల ప్రతినిధులు ప్రశంశలలో ముంచెత్తుతున్నారు. ప్రభుత్వం, దేవాదాయ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరచి కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా హిందూ దేవాలయాలలో వివిధ రంగాలలో పాగా వేసి ఉన్న అన్య మతస్థులను గుర్తించి తొలగించవలసిందిగా వారు కోరుతున్నారు. మొత్తం మీద హైకోర్టు తీర్పుతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.