‘హిందూ రాష్ట్ర’ సాధించాలంటున్నామంటే దానర్ధం ఇక్కడ ముస్లిములకు స్థానం లేదని కాదు – ఆర్. ఎస్. ఎస్. చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్

విశేషాలు
- హిందూత్వ అనేది భారతీయ సాంస్కృతిక విలువల యొక్క సారాంశం మరియు విభిన్న విశ్వాసాలలో ఉన్న ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడమే దాని లక్ష్యం.
- భారతియ భావనకు హిందూత్వ పర్యాయపదం.
- తమ ఆరాధనా విధానం వేరుగా ఉండవచ్చు కానీ మేం ‘ భరత మాత ‘ సంతానమే అని ఇస్లాం మత విశ్వాసకులు చెప్పారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ న్యూఢిల్లీలో దాదాపు 30 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 50కి పైగా మీడియా సంస్థలకు చెందిన 80 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారితో సర్ సంఘచాలక్ నిరంతరం జరిపే నిర్మాణాత్మకమైన చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది. రెండున్నర గంటలపాటు జరిగిన ఇష్టాగోష్టిలో శ్రీ మోహన్ భాగవత్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృక్పధాన్ని, దార్శనికతను భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ ‘హిందూ రాష్ట్రం’ అంటే, ఇక్కడ ముస్లింలకు స్థానం లేదని అర్థం కాదని, అన్ని విశ్వాసాలు, మతాలను కలుపుకొని పోవడమే ఈ భావన అసలు ఉద్దేశ్యమని అన్నారు.
“సంఘం సార్వజనీన సోదరభావం వైపు పనిచేస్తుంది. ఈ సోదరభావానికి సంబంధించిన ప్రధాన సూత్రం వైవిధ్యంలో ఏకత్వం.
ఈ ఆలోచన మన సంస్కృతి నుంచి వస్తుంది. దానినే ప్రపంచం హిందుత్వ అని పిలుస్తుంది. అందుకే దీన్ని “హిందూ రాష్ట్ర”గా పిలుస్తాం. అని అన్నారు.
“ఆర్ఎస్ఎస్ తత్వమే అందరినీ కలుపుకు పోవడం.” అని నొక్కి చెబుతూ, “హిందూ రాష్ట్ర” అంటే ఇక్కడ ముస్లింలకు స్థానం లేదని అర్ధం కాదు. అలా చెప్పిన రోజు, అది హిందూత్వ ఏ మాత్రం కాదు. ఎందుకంటే హిందూత్వం “వసుధైవ కుటుంబకమ్” అని చెబుతుంది.
హిందూత్వ అనేది భారతీయ సాంస్కృతిక విలువల యొక్క సారాంశం మరియు విభిన్న విశ్వాసాలలో ఉన్న ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడమే దాని లక్ష్యం అని శ్రీ మోహన్ భాగవత్ అన్నారు.
రాజ్యాంగ సభలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగాల్లో దేశ ప్రజలలో సార్వత్రిక సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ఉద్ఘాటించిన విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ వ్యక్తుల గౌరవ సంరక్షణతోపాటు జాతీయ సమగ్రతను కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారని శ్రీ భాగవత్ చెప్పారు.
భారతియ భావనకు ‘హిందూత్వ’ పర్యాయపదం. ఇది భారతీయులందరినీ నిర్వచించడానికి, వైవిధ్యంలో ఏకత్వానికి సూచికగా ఉంది.
సంఘ్ కూడా అదే సార్వజనీన సోదరభావాన్ని విశ్వసిస్తుంది. వైవిధ్యంలో ఏకత్వం అనే భావన దీనికి ఆధారం. ఈ ఆలోచన హిందూ రాష్ట్రమని ప్రపంచం వివరించే ఒక భావజాలం నుంచి వచ్చింది అని శ్రీ భాగవత్ వివరించారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికీ, అంబేడ్కర్ సూచనలకూ మధ్య ఉన్న సారూప్యతను వివరించటానికి శ్రీ భాగవత్ ప్రయత్నించారు.
హిందూ రాష్ర్టాన్ని అభివర్ణిస్తూ… “హిందుత్వ చెబుతున్న దాని ప్రకారం “హిందూ రాష్ట్ర”లో అన్ని విశ్వాసాలు, మతాలకు స్థాననమున్నద”ని డాక్టర్ భాగవత్ తెలిపారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ “సర్వేపి సుఖినస్సంతు”ను విశ్వసిస్తుంది. ఇది ‘గరిష్ట ప్రజల యొక్క గరిష్ట మేలు’ అనే భావనకంటే మిన్నయైనద”ని శ్రీ భాగవత్ తెలిపారు., ఈ భావన ఏ ఒక్క భాషకో, దేవుడికో పరిమితమైనది కాదని ఆయన అన్నారు.
“భారత ప్రజలమైన మనం వివిధ రాష్ట్రాలు, భాషలు, కులాల వారిగా విభజింపబడి ఉన్నాం. కానీ మనల్ని మనం విశ్వ మానవ విలువల అనుయాయులైన భారతమాత సంతానంగా ప్రపంచానికి చాటుకోవలసిన అవసరం ఉంది.” అని శ్రీ భాగవత్ అన్నారు.
హిందువులు, హిందూత్వ గురించి శ్రీ భాగవత్ చేసిన సుదీర్ఘ ప్రసంగంలో “మతం అనేది ఒక నియమావళి కాదని, విలువల సముదాయం” అని డాక్టర్ అంబేద్కర్ అన్నారని, ఆ విలువలే హిందూత్వానికి ఆధారమని అన్నారు.
1881 లో హిందువులు ఆదరించిన ఒక ముస్లిం ఆటగాడి ఉదాహరణను పేర్కొంటూ, “తమ ఆరాధనా విధానం వేరైనా తామంతా భారతమాత సంతానమ”ని కొందరు ఇస్లాం మతస్థులు కూడా చెప్పారని శ్రీ భాగవత్ ఈ సందర్భంగా తెలిపారు.
ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి, సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య, డాక్టర్ కృష్ణ గోపాల్ ఉత్తర క్షేత్ర సంఘచాలక్ డాక్టర్ భజరంగదళ్ గుప్తా, ఢిల్లీ ప్రాంత సంఘచాలక్ కులభూషణ్ అహుజా తదితరులు పాల్గొన్న ఈ సమావేశానికి కేంద్రమంత్రులు ప్రకాశ్ జావదేకర్, గిరిరాజ్ సింగ్, విజయ్ సంప్లా, జెడి (యు) కు చెందిన కెసి త్యాగి, రిటైర్డ్ జడ్జీలు, మాజీ సైన్యాధికారులు కూడా హాజరైనారు.
Source : The Times of India.





