
మానవసేవే మాధవసేవని శృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి పేర్కొన్నారు. విజయయాత్రలో భాగంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని మిన్నెకల్లు గ్రామంలో కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. అర్చక గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కల్యాణ మండప ఇన్‌చార్జి, గ్రామస్తుడు బొల్లినేని రామకృష్ణ, గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తమ గ్రామానికి వచ్చిన స్వామిజీకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్నారుల కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కల్యాణ మండప నిర్మాణం కోసం పీఠం నుంచి రూ.కోటి, గ్రామస్తుల తరుపున రూ.15 లక్షలు విరాళంగా ఇవ్వగా మండప ఇన్‌చార్జి బొల్లినేని రామకృష్ణ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. మిన్నెకల్లు పరిసర గ్రామాల్లోని వారికి వివాహాది శుభకార్యాలు జరిపించుకోవడానికి ఒక మంచి కల్యాణ మండపం అందుబాటులోకి వచ్చినట్‌లైందని రామకృష్ణ తెలిపారు. పీఏ మోహన్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.




