
శ్రీకాకుళం జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న 795 ఆలయాల్లో భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భూములు అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ బి ఆర్ ఆర్ పట్నాయక్ హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలో వివిధ ఆలయాల పరిధిలో తొమ్మిది వేల ఎకరాల భూమి ఉందని.. దీన్ని కంప్యూటరైజేషన్ చేశామని.. దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. ఖరీదైన భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. ప్రతీ చోటా ఆక్రమణలు జరగకుండా బోర్డులు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దేవాదాయశాఖ భూముల వివరాలు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లో మరియు వివిధ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉన్నాయని అన్నారు. జిల్లాలో శ్రీవాణి పథకం కింద టీటీడీ సౌజన్యంతో 85 ఆలయాలు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలో 139 ఆలయాలకు దూప దీప నైవేద్యము కింద నెలకు పదివేల రూపాయలు చొప్పున ఆలయ నిర్వహణకు నిధులు ఇస్తున్నామని అన్నారు.




