
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 70 వ జాతీయ సదస్సు సందర్భంగా అహల్యాబాయి నగర్ లో సంత్ మహంత్ వైద్యనాథ్ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో భారత కేంద్రిత విద్యావ్యవస్థ పునరుద్ధరణ కోసం మహంత్ వైద్యనాథ్ చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలున్నాయి. అలాగే స్వాతంత్ర పోరాటం కోసం, అయోధ్య రామ మందిరం కోసం ఆయన చేసిన కృషికి సంబంధించిన ఫొటోలూ వున్నాయి. ఈ ఎగ్జిబిషన్ ను చంపత్ రాయ్ వీక్షించారు. వీటితో పాటు స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ఆర్కైవ్స్, సమరయోధుల గాథలు, అహల్యాబాయికి సంబంధించిన ఫొటోలు కూడా వున్నాయి. వీటన్నింటితో పాటు భారతీయ కళాఖండాలు, సంస్కృతికి సంబంధించిన చిత్రాలూ వున్నాయి.
ఏబీవీపీ 70వ జాతీయ సదస్సు దేశ ఐక్యతకు మంచి ఉదాహరణ అని చంపత్ రాయ్ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం తమ హక్కుల వెంబడి పడుతోన్న వేళ, దేశంలోని విశ్వవిద్యాలయాలలోని యువతలో కర్తవ్య భావాన్ని నింపడంలో ఏబీవీపీ నిమగ్నమైందని తెలిపారు. దేశానికి యువత కీలకమైన దిశానిర్దేశం చేస్తుందని, స్వామీ వివేకానంద, అహల్యాబాయి, దీనదయాళ్, తమ యవ్వనంలో సమాజ జాగృతి కోసం చేసిన కృషి నిత్య స్మరణీయమని పేర్కొన్నారు. మహంత్ వైద్యనాథ్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని చంపత్ రాయ్ గుర్తు చేసుకున్నారు. జాతీయ ఐక్యత విషయంలో మహంత్ ఆలోచనల్ని తనతో పాటు అనేకుల్ని ప్రభావితం చేసిందన్నారు. ఏబీవీపీ సమావేశానికి రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చంపత్ రాయ్ తెలిపారు.




