గుంటూరు జిల్లా, పొన్నూరు మండల గ్రామం మునిపల్లె శివారులో ‘వీర గల్లు’ శిల్పాన్ని యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి బుధవారం గుర్తించారు. గొల్లమూడిపాడు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో ఇది మట్టిలో కూరుకుపోయి ఉంది. పూర్వం వీరులు, గ్రామానికి చెందిన ప్రముఖులు యుద్ధంలో లేదా జంతువులతో పోరాడుతూ మరణించిన సందర్భంలో వారి గుర్తుగా ఒక శిల్పంపై ఆ వీరుడి ప్రతిమను చెక్కి నిలుపుతారని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
మునిపల్లె శివారులోని వీరగల్లు శిల్పం సుమారు మూడు అడుగులు పొడవు ఉందనీ, దీనిపై పురుషుడు, రెండువైపులా స్త్రీల ప్రతిమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది గ్రామ చరిత్రకు ఆనవాలుగా చెబుతూ, దీన్ని శుభ్రం చేసి, గ్రామంలో పీఠంపై బిగించి వివరాల పట్టిక ఏర్పాటు చేస్తే భావిత రాలకు చారిత్రక వారసత్వంగా నిలుస్తుందని చెప్పారు. గ్రామంలోని శ్రీ అగస్త్యశ్వర ఆలయంలో నందిబొమ్మ చెక్కిన శిలాఫలకంపై శాసనాన్ని శ్రీనాథ్ రెడ్డి గుర్తించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆ శాసనం భూమి లోపల ఉందని, ఇటీవల ఆలయ మరమ్మతుల్లో భాగంగా దాన్ని పైకి తీశారని తెలిపారు. ఫలకంపై కనిపిస్తున్న కొద్దిపాటి అక్ష రాల ఆధారంగా 18-19 శతాబ్దాలకు చెందిన తెలుగు లిపిలో ఉందని, అందులో మునిపల్లె అని కూడా రాసి ఉందని పేర్కొన్నారు.





