
సనాతన ధర్మానికి హాని కలిగితే మొత్తం ప్రపంచానికే హాని కలుగుతుందని దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠ ఉత్తరాధికారి విదుశేఖర మహాభారతీస్వామి భాషించారు. విజయవాడలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గ, మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శివుడికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి అనుగ్రహ భాషణం చేశారు. కళావేదికపై ఆశీనులైన ఆయనకు ఈవో రామారావు దంపతులు సంప్రదాయల మేరకు వస్త్రాలు, పండ్లు సమర్పించారు. ఇదే సమయంలో అపౌరుషేయ సంస్కృత మహాభాగవత గ్రంథాన్ని ఈవో రామారావు స్వామికి అందచేయగా, ఆయన ఆవిష్కరించి శుభాశీస్సులు అందచేశారు.
అనంతరం ఆయన అనుగ్రహ భాషణ చేస్తూ విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి శృంగేరి శారదాపీఠానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేశారు. ఇక్కడికి తాము ఆరేళ్ల క్రితం ఆలయానికి వచ్చామని, మళ్లీ ఇప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నామన్నారు. ఇక్కడ సనాతన ధర్మానికి, సంస్కృతికి పూర్తిస్థాయిలో చోటుందన్నారు. అర్జునుడు యుద్ధంలో గెలవాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పక కావాలని శ్రీకృష్ణుడు చెప్పటం విశేషమన్నారు. సనా తన ధర్మం బాగుంటేనే లోకం అంతా బాగుంటుందని, ఈ ధర్మంలో తాను, తన కుటుంబం బాగుపడాలనేది కాకుం డా సర్వే జనాః సుఖినో భవంతు అని ఉంటుందని ఇదే ధర్మం ప్రధాన అంశమన్నారు.
ఈవో రామారావు మాట్లాడుతూ స్వామివారు అమ్మవారి దర్శనానికి రావటం మనందరినీ అనుగ్రహించి భాషణ చేయటం ఎంతో పుణ్యప్రదమని తాను భావిస్తున్నట్టు చెప్పారు. శారదా అమ్మవారి పీఠం నుంచి దేవదాయ శాఖకు మన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, దుర్గమ్మ ఆలయానికి శుభాశీస్సులు ఉన్నాయన్నారు. మల్లేశ్వరాలయం శిథిలావస్థలో ఉండగా స్వామి సూచనల మేరకు పునరుద్ధరించామని, దాత సంగా నరసింహారావు సహకరించారని, స్వామి సూచనల మేరకు ఆలయాన్ని తీర్చిదిద్దారన్నారు. కనకదుర్గావైభవం గురించి పూర్తిస్థాయిలో గ్రంథాలు లేని కొరతను గమనించి పుస్తకాలను ప్రచురించామని, రాయదుర్గంలోని గురువులు ఆశీస్సులతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టి కనకదుర్గా వైభవం పుస్తకాలను ప్రచురించామన్నారు. విదుశేఖర భారతీస్వామివారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి అనుగ్రహ భాషణం చేశారన్నారు. దేవస్థానానికి ఒక వేద పాఠశాల ఉందని, దాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలనుకుంటున్నామని, ఆ కోరికను స్వామివారి అనుగ్రహంతో పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.





