News

కెనడా యజమానులం మేమే…. కొత్త రాగం అందుకున్న ఖలిస్తానీలు

207views

ఖలిస్తానీ వేర్పాటువాదులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లూ హిందువులను టార్గెట్ చేశారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. కెనడాలోని హిందువులను తిరిగి భారత్ వెళ్లిపోవాలని హెచ్చరికలు కూడా చేశారు. ఇప్పుడు ఖలిస్తానీలు స్థానికంగా వుండే కెనడియన్లపై పడ్డారు. కెనడాలోని తెల్ల జాతీయులే దురాక్రమణదారులంటూ ఆరోపిస్తున్నారు. అసలు కెనడాయే తమదని ఖలిస్తానీలు ప్రకటించేసుకుంటున్నారు. తెల్లజాతి వారే ఇతర దేశాల నుంచి కెనడాకి అక్రమంగా వచ్చి నివసిస్తున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారు. శ్వేతజాతీయులంతా యూరప్ కి తిరిగి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఖలిస్తానీ వేర్పాటువాదులు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇది తెగ వైరల్ అవుతోంది. అసలు సిసలైన కెనడా యజమానులం తామేనని ప్రకటించుకున్నారు. తామే గొప్ప కెనడియన్లమని, అక్కడి శ్వేతజాతీయులంతా యూరప్ లేదా ఇంగ్లాండ్ కి వెళ్లిపోవాలని డిమాండ్లు చేస్తున్నారు. ‘‘ఇది మా దేశం. మేమే కెనడాకి యజమానులం. కెనడియన్లుగా గర్విస్తున్నాం. యూరప్ కి తిరిగి వెళ్లిపోండి.’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు.

అయితే ఈ పరిణామంపై భారత ఇంటెలిజెన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్తానీ వేర్పాటువాదులు విజృంభిస్తున్నారని పేర్కొంది. తమ అంచనాల ప్రకారం రాబోయే ఎన్నికల్లో గెలవడానికి అక్కడి ప్రధాని ట్రూడో ఖలిస్తానీ గ్రూపులకు మద్దతిస్తున్నారని భావిస్తోంది.ట్రూడో ప్రజాదరణ క్షీణిస్తోందని, అందుకే భారత్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆక్షేపించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో హిందువులను బెదిరిస్తుండగా… ఇప్పుడు కెనడీయులందర్నీ ఖలిస్తానీలు బెదిరిస్తున్నారు.