
విశాఖపట్నం జిల్లా సింహాచలం సింహగిరిపై ఉన్న జలధారలపై దాన్ ఫౌండేషన్ సంస్థ అధ్యయనం చేసింది. ఆ ఫౌండేషన్ ప్రతినిధి ఎస్. లోకేష్ సింహగిరిపై ఉన్న గంగధార, నాగధార, సాగిధార, ఆకాశధారలను పరిశీలించారు. నీటి నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో తమ సంస్థ నగరంలో ఉన్న స్ప్రింగ్స్‌పై అధ్యయనం చేస్తోందన్నారు. నీటి నాణ్యత, వాటర్ ఫ్లో తదితర అంశాలపై పరిశీలిస్తున్నామన్నారు. అందులో భాగంగా సింహాచలం కొండపై ఉన్న జలధారలను కూడా అధ్యయనం చేయనున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి ఫ్లో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందా… లేకపోతే ఏంచేయాలన్న విషయంపై నిపుణులతో చర్చిస్తామన్నారు. దీనిపై ఓ రిపోర్టు తయారు చేయనున్నామని వెల్లడించారు. ఈనెల 23న కలెక్టర్, వీఎంఆర్‌డీఏ కార్యదర్శి సమక్షంలో సింహాచలం దేవస్థానం అధికారులు, తమ ఆర్గనైజేషన్ అందజేసే నివేదికపై చర్చిస్తారన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రాంబాబు పాల్గొన్నారు.





