
వైయస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనులు నిదానంగా సాగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో ముఖ మండపం, అంతరాలయం, గర్భగుడిలో నల్లబండలు తొలగించి చలువరాయి పరచాలని అమరావతిలోని భారతీయ పురావస్తు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విమాన గోపురంలో దెబ్బతిన్న శిల్పాలకు పుర్వాకృతి తీసుకురావాలని, ప్రాకారం పిట్ట గోడపైన మరమ్మతులు చేయాలని అనుమతిచ్చారు. రెండు నెలల కిందట టెండర్లు పిలిచారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 9 నుంచి రెండు నెలల పాటు గర్భగుడిని మూసివేయాలని తెలిపారు.సెప్టెంబరు 6-8 వరకు బాలాలయం పూజలను నిర్వహించారు. అప్పటి నుంచి గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ముఖ మండపం, అంతరాలయం, గర్భగుడిలో చలువరాయి పరిచే పనులు మాత్రమే పూర్తయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణ, హనుమంతుడి గుడి గోడలకు పూత వేయాలి. అదేవిధంగా గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపంలో కొత్త తలుపులు ఏర్పాటు చేయాలని అర్చకులు అడుగుతున్నారు. ఇవి ఇంకా మొదలు కాలేదు. గర్భగుడి విమాన గోపురంపైన శిల్పాలకు పుర్వాకృతి తీసుకురావాల్పి ఉంది. ఇక్కడ ఇటీవలే రసాయనాలతో శుద్ధి చేశారు. శిల్పులను రప్పించి మరమ్మతులు చేయించాలి.
మరో మూడు నెలలు ఆగాల్సిందేనా?
ఇప్పటిలాగే నిదానంగా పనులు చేస్తే ఈ నెలాఖరుకు పూర్తవ్వడం గగనమే. డిసెంబరు, 2025 జనవరిలో సరైన ముహూర్తాలు లేవు. ఈ నేపథ్యంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన తర్వాత వచ్చే ఫిబ్రవరి 10-15 మధ్యలో (మాఘ మాసంలో) మంచి ముహ్తూరం ఉండటంతో మహా సంప్రోక్షణ, సహస్ర కలశాభిషేకం, రామయ్యకు పట్టాభిషేకం పూజలను శాస్త్రోక్తకంగా నిర్వహించాలని తితిదే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇంకా తేదీలను ఖరారు చేయలేదు. గర్భాలయంలోకి భక్తుల ప్రవేశం, సీతారామలక్ష్మణ మూర్తుల మూలవరుల దర్శన భాగ్యం పొందాలంటే మూడు నెలల వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. అంతవరకు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలమూర్తులను దర్శించుకోవాల్సిందే.
త్వరలో పూర్తి చేయిస్తాం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జీర్ణోద్ధరణ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని తొలుత నిర్ణయించాం. వర్షాలు కురవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. త్వరలో మరమ్మతులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం.- బాలకృష్ణారెడ్డి, జిల్లా బాధ్య అధికారి, పురావస్తుశాఖ, కడప





